పుట:కాశీమజిలీకథలు-06.pdf/104

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కమల కథ

109

ఆమె వృద్దరాజుగారి పత్నియని యెఱింగి చిదంబరయోగి మిక్కిలి గౌరవించుచుఁ గృష్ణానజిముపై వారిరువురం గూర్చుండ నియమించి విరక్తుండైనను బ్రస్తుతోపయోగముగాని నయ్యోగి నామె కిట్లనియె.

దేవీ ! నూరేండ్లక్రిందట నీ మామగారి తండ్రి యీమఠముఁ గట్టించెను. నాటంగోలె నింద విచ్ఛన్నముగా మహర్షులు తపము సేసికొనుచున్నారు. తత్సంతతివారును దీని కే యంతరాయము లేకుండ జరుపుచున్నారు నీ భర్త వారమున కొకసారి వచ్చి చూచి తాపసుల మంచిచెడ్డ లరసి పోవుడుండెడి వాఁడు. ఇప్పుడు నీ కుమారుఁడు చూడకపోయినను బ్రధానులనంపి విమర్శించుచున్నాడు. మా కే లోపములును లేవు. స్వర్గసౌఖ్యములు మాకందిచ్చి మీవారందు సుఖించుచున్నారని ప్రస్తావోచితముగా స్తుతించి నీ కేదియో యభిలాష యుండినం జెప్పుము. నా యోపినంతఁ గావింతునని పలికిన విని యామె యటునిటు చూచి యించుక జనాంతకముగా నిట్లనియె.

స్వామీ ! మీరు భగవంతుని వంటివారు మీ దర్శన మూరక పోవునా? నేనొక కోరికతో మీయొద్దకు వచ్చితిని. వినుండు. ఈ చిన్నది నాయన్న కూతురు. చిన్నతనములోఁ దల్లి చనిపోయిన నేను పెంచి పెద్ద దానింజేసితిని నా భర్త దారిబోయెడివాని నొకనిజేరఁదీసి రాజ్యంబిచ్చి నాకమున కరిగిరి. ఈతారావళిని బెండ్లిఁ జేసికొమ్మని పుత్రునితో వృద్ధరాజుగారు మొదటనే చెప్పియున్నారు. అతండు దానిం బరిణయం బాడుమని యెన్ని సారులు చెప్పినను గాలహరణము సేయుచున్నాఁడు. అక్కర లేదనియుం జెప్పఁడు. మీరు సర్వజ్ఞులుగదా. ఇందలి కారణ మేదియో చెప్పవలయును. మఱియు మీయొద్ద వశ్యౌషధములుండక మానవు. ఏదియైన దయచేసి మాకార్యసాఫల్యము సేయఁగోరుచున్నదాన. అని వినయముగాఁ బ్రార్ధించిన నయ్యోగి యొక్కింత ధ్యానించి అమ్మా ! రెండునాళ్ళు తిరిగిన వెనుక నాయొద్దకు నీపరిచారకు నొకని నంపుము మంత్రభస్మమునిచ్చెద. దాన నీయభీష్టముతీరునని చెప్పెను.

అని వారు మాటాడుకొనుచుండగనే కమల స్నానముఁజేసి యచ్చటికి వచ్చినది. రాజపత్ని కమలం జూచి నివ్వెరఁపడుచు స్వామీ! ఈ చిన్నది యెవ్వతె యని యడిగిన నతఁడు. దేవి! ఇది నాశిష్యురాలు. దీనిపేరు కమల తత్వోపదేశమైనదని చెప్పెను. ఆ మాట విని రాజపత్ని యత్యంత విస్మయముతోఁ గనులం జూచుచు బోఁటీ! నీ వేమిటికింత చిన్న తనములో విరక్తిఁ జెందితివి? నీ రూపము చాల వింతగా నున్నదే. నీతలిదండ్రు లెవ్వరు? పెండ్లియాడితివా? యని యడిగినఁ గమల నవ్వుచు నిట్లనియె.

అమ్మా! నా వెనుకటి వృత్తాంత మేమియుఁ జెప్పరాదు. తలఁపరాదు. నాకందరు గలిగియుండిరి. ఇప్పుడు నా కెవ్వరును లేరు. నేను లేనిదాననగుచున్నాను. దేహములు క్షణభంగురములు. విరక్తిఁజెందవలసిన సమయ మిదియని నిరూపింపఁబడి యున్నదా యేమి? అంతఁదనుక నిలుచుటకు మనయిష్టమా? మృత్యువు నెత్తిమీద