పుట:కాశీమజిలీకథలు-06.pdf/103

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

గీ. చెలఁగి వేదాంత వాదముల్సేయువారు
    ఒకదెస యోగి జనులకు మ్రొక్కువారు
    విమలగతి వహ్నిహోమము ల్వ్రేల్చువారు.
    అందుఁ గలవారలెల్ల మహావిరక్తి.

అందు నఖంబులు మెలికలువారి తోరముగా నెదుగ వ్రేలాడు గడ్డంబులును ఒడలును మహానుభావత సూచింప నొడలెల్ల భూతిఁబూసికొని తపం బొనరించుచున్న దిగంబరు లనేకులు గలరు.

అట్టి మఠంబున కొకనాఁడు త్రిజన్మోహన సౌందర్యంబునం బొలుపొందు కమలయను బాలయోగిని యొకతె యరుదెంచినది. ఆ యోగినింజూచి యందున్న విరక్తులెలఁ గందర్పభల్ల ములకెల్ల యగు నుల్లములతో నిట్లు దలంచిరి ఆహా ! యీమోహనాంగి తొలిప్రాయములో నిట్లు విరక్తిఁజెందుటకు గతం బగ్రహ్యంబుగదా? ఇత్తరుణీ రత్నమును జూచిన నే సార్వభౌముఁడు వరింప నుండెడిని. ఈ ముద్దుగుమ్మ యెవ్వరికి శుశ్రూషజేయునో యాతఁడే ధన్యుఁడుగదా? అని పలుభంగులఁ దలంచుచుండ నాచిన్నది యామఠం బంతయుఁ దిరిగి యందలి యోగులను విమర్శించి చిదంబరయోగి యుత్తముఁడని నిశ్చయించి యతనికి నమస్కరించిన నతండు కొంతవడికిఁ గన్నులఁ దెఱచి బాలా ! నీవెవ్వతవు? ఏమిటి కిట్లు వచ్చితివని యడిగిన నాయోగిని యిట్లనియె స్వామీ ! నే నాత్మభవఖేదంబు నిమిత్తముగా విరక్తిఁ జెంది మీ చరణము లాశ్రయింప వచ్చితిని. మనోహర వ్యాహారములు సెప్పి నన్నుద్ధరింపుఁడు. కొంతకాలము మీ శిశ్రూషఁ గావించి కృతార్దురాల నయ్యెదను. ఈ యోగులలో మీరు పరమోత్తములని యత్యంతభక్తి వినయ విశ్వాసములతోఁ బ్రార్థించిన సంతసింపుచు నతండు తత్సేవ కంగీకరించెను.

సమయమరసి యా సరసిజాక్షి యా పారికాంక్షియొద్దఁ దత్వవిశేషములు గ్రహింపుచుండెను. ఆ మఠమునందున్న యోగులా యోగిని వచ్చినది మొదలు జపములుమానిరి. తపములు విడచిరి యోగములు వదలిరి. ఏదియో మిషఁబూని యా మీననేత్రిఁ జూచుచుందురు. తత్వరహస్యములు సెప్పుమనియె దివ్యమంత్రోపదేశములు గావింపుమనియుఁ బెక్కండ్రు వచ్చి యా చిదంబరయోగి నాశ్రయించుచుందురు. అతండు సెప్పునప్పుడేమియును వినక యా యువతినే చూచుచుందురు.

వారి వికారము లరసి యత్తరుణి శాటీపగం బవకుంతనముఁ జేసికొని యెవ్వరివంకఁ జూడక జపముఁ జేసుకొనుచుండును.

ఇట్లుండ నొకనాడుఁ కిన్నరదత్తుని భార్య తారావళిం దీసికొని రహస్యముగా నామఠమున కరుదెంచి యందున్న యోగిబృందమునకు వందనములు సేయుచు వారిలోఁ జిదంబరయోగి మహానుభావుండని విని యతనివద్దకు బోయి నమస్కారములు గావించినది.