పుట:కాశీమజిలీకథలు-05.pdf/44

ఈ పుట ఆమోదించబడ్డది

50

కాశీమజిలీకథలు - ఐదవభాగము

చ్చును. అయిదుదినము లహోరాత్రంబు లేకరీతి వర్షము గురియుటచే భూమియంతయు జలమయమైనది. మేము నర్మదానదీ తీరవాసులము. బ్రాహ్మణులము. నర్మదానది పొంగి మా యగ్రహారములన్నియు ముంచివేసినది. సస్త్రీబాల వృద్ధముగా బ్రాణములు దక్కించుకొని యీమెట్ట యెక్కితిమి వరద పెచ్చు పెరుగుచున్నది. ఇప్పటికైన వరద తీసినచో గొన్ని యిండ్లు నిలుచును. కొందరు బ్రదుకుదురు. కొన్ని సస్యములు ఫలించును. కొంతసొమ్ము దొరుకును. గోవిందయతి యార్తత్రాపరాయణుండనియు మా యార్తి బోఁగొట్టసమర్ధుఁడని యతని నాశ్రయింపవచ్చితిమి. ఆ దయాహృదయం డెందును గనంబడకున్నవాఁ డిదియే మా వృత్తాంతమని చెప్పిన విని మందహాసముఁ గావింపుచు శంకరుడు ఒక కడవ నభిమంత్రించి వారికిచ్చి, విప్రులారా! మీరు చింతింపకుఁడు. ఈ కుంభమును వేగముగాఁ దీసికొనిపోయి నర్మదానదీ ప్రవాహంబున విడువుఁడు. మీయార్తి వాయునని చెప్పి యది వారికిచ్చెను. అప్పుడే వారాఘటమును దీసికొనపోయి నర్మదలో విడిచినంత

క. బుడబుడయను చప్పుడుతో
   గడగడ నీరెల్ల ద్రావెఁ గడవ యడియగ
   స్త్యుఁడుమున్ను వార్ధిఁగ్రోలిన
   కడిదిని నక్కడవ కెంత కడుపున్నదియో.

గీ. కడవవాకఁగోలఁ గడవకుఁ బొడమిన
    బుడుతగ్రోలెఁబిదప గడలినెల్లఁ
    దల్లి గుణ మొకింత తగులనిచో నట్టి
    ఘనతగాంచునే యగస్త్యుఁడపుడు.

గీ. ఇవముతో నట్లు గడవ నీరెల్లఁద్రావఁ
   గడిగినట్లున్న వెప్పటి కరణిఁజెక్కు
   చెదర కిండ్లును వాకిండ్లు జెట్లు చేలు
   మందునకునైన లేదందు బిందువొకటి.

ముహూర్తకాలములో నద్దేశమెల్ల నిర్జలమగుటయు వెరఁగుపడుచు నప్పుడమివేల్పులా శంకరుని సుతసతీయుతముగాఁ గొనియాడుచు మితిలేని సంతసముతోఁ దమతమ నెలవులకుంబోయిరి. గోవిందయతియు సమాధినుండి లేచి యా వృత్తాంత మంతయు విని, యోహో ! యీతండు యోగసిద్ధుండయ్యె. నీతనికజేయం బేదియును లేదని సంతసించెను. అతండు మరియొకనాఁడు శంకరుఁజూచి, వత్సా! శంకర! అవిద్యావరణమునుబాసి జ్ఞానంబునం బ్రకాశిల్లు పరతత్త్వమువలెనే మేఘశూన్యమై శరదృతువుచే గగనమెంత నిర్మలముగా నున్నదియో చూచితివా? మరియు హరిదంబులు చిరసముపార్జితంబులకు జీవనంబుల లోకంబులకుఁ దృప్తిఁజేసి తటిత్కాంతల విడచి గగనగృహములనుండి సన్యసించిన యతులవలె నరిగినవి కంటివే! శ్రవణమనన నిధి