పుట:కాశీఖండము.pdf/443

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

431

సప్తమాశ్వాసము

దుర్వాసోలింగమాహాత్మ్యము

వ.

ఇందు దుర్వాసేశ్వరలింగమాహాత్మ్యం బభివర్ణించెద నాకర్ణింపుము.

24


తే.

సకలదేశంబులందును సంచరించి
ఋషివరేణ్యుఁడు దుర్వాసుఁ డేగుదెంచె
నఖిలముక్తివధూవిహారావరోధ
సౌధవీథికిఁ గాశికాస్థానమునకు.

25


వ.

ఇట్లు వచ్చి యమ్మహాభాగుండు భాగీరథీనదీమాతృకంబులై ముక్కారును బండు పంటవలంతికేదారక్షేత్రంబులు, నిర్ధూతకలధౌతశలాకాశకలశంక నంకురింపఁ జేయఁ జాలు క్రొత్తమొలక లొత్తునవియును, సుకుమారశుకచ్ఛదచ్ఛటాదాయాదంబులై యడ్డపచ్చఁ గొనునవియును, నార్యావర్త దేశమత్తకాశినీజంఘాకాండ పాండిత్యంబు గండూషించి చిగురుపొట్టలఁ గనుపట్టునవియును, బదియాఱువన్నియకడానికుందనంబు హెచ్చు కుందాడుపసిమిఁ బచేళిమంబు లగునవియు నైన ప్రాసఁగుంజేలును, వికటఘటీయంత్రప్రాంతవాపికాసలిలధారాధోరణీప్రవాహసేకసంవర్థితంబు లై జంబూజంబీర నారికేళ పనస సహకారకురవకవకుళాశోకశాకోటకుటజముఖ నిఖిలవిటపివాటికాభిరాామంబులైన యారామంబులును, సముద్దండపుండరిక కువలయ కుముదషండమండితంబు లగుతీర్థకుండంబులును, [1]నారసాతలగంభీరరసలిలసంభారంబు లైన పరిఖాచక్రంబులును, గనకగిరిప్రదీప్తవప్రాకారంబు లగు ప్రాకారంబులునుం గనుంగొనుచు, భూర్భువస్వర్మహాలింగ

  1. సారసోత్సలోదంచితసలిలసంభారరసాతల