పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/5

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వసుచరిత్రమును బూర్తిగ ననుకరించినకతన అబ్బయామాత్యుఁడు వసుచరిత్ర రచనకాలమున కీవలివాఁ డనుట స్పష్టము. కవివంశజులలో నిప్పటితరమున సూర్యనారాయణ యనువారున్నారు. ఈయనవయస్సు 42 సంవత్సరములు. ఆయననుండి పురుషులను దీసికొన్నచోసుబ్బయ్య - శ్రీనివాసరాయఁడు - సుబ్బరాజు - వెంకన్న - పెద్దిరాజు - గ్రంథకర్తయగు అబ్బరాజు వంశవృక్షమువలనఁ గన్పట్టిరి. అనఁగా సూర్యనారాయణగారికిఁ బ్రకృతగ్రంథకర్త ఆఱవతరమువాఁడు. తరమునకు ముప్పదియేండ్లవంతున లెక్కించినచో అబ్బయామాత్యుఁ డిప్పటికి నూటయెనుబదియేండ్లక్రిందట క్రీ.శ. 1750 ప్రాంతమున నుండె ననుట స్పష్టము. ఇంతకంటే బలవత్తరములగు నాధారములు లభించువఱ కీనిర్ణయము విశ్వసనీయమని మాతలంపు.

కవిరాజమనోరంజనము రసవత్తరమగు ప్రబంధము. కవి వర్ణనములకుఁ బాటుబడినటులఁ గథాకల్పనమునకుఁ బాటుపడలేదు. "ఆద్యసత్కథల్ వారివిపుట్టురత్నము”లన్నట్లు ఇందలికథాంశము పురాణములనుండి యథావిధముగఁ బ్రబంధములోనికి మాఱినది. ఈ మార్పునకు అష్టాదశ వర్ణనలు అంత్యనియమపద్యములు చిత్రకవిత మున్నగుకవితాశిల్పములు తోడ్పడినవి. అంతియగాని ప్రధానపాత్రముల నాదర్శప్రాయముగఁ జిత్రించుట, ప్రకరణోచితముగఁ గథను సృజించుట మున్నగు నూతనవికాసము లీప్రబంధమునఁ గానరావు. మృదుమధురమగు నీకవికవిత స్వతంత్రముగనున్నంతదనుక మనోజ్ఞముగనున్నది. వసుచరిత్రము ననుకరించినతావులలోఁ గొంతకొంత పేలవము కనిపించుచున్నది. ఎట్లయిన నేమి సమకాలికగ్రంథములలో మిన్నయనుట సత్యము. ప్రధానకథాబీజము గొని కాళిదా సిందలికథనే తారుమా రొనరించి విక్రమోర్వశీయమున దనఁ గథాసంస్కరణనైపుణ్యమును బ్రకటించినాఁడు. నాటకములఁ బ్రబంధములుగ మార్చుకాలమున నున్న యిక్కవి యిందులకు దొరకొనమి సంతాపకరము. అబ్బనామాత్యుని మనోహర