పుట:కవికర్ణరసాయనము.pdf/86

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

మును జలము సవతిపైఁ జ, ల్లినఁ గినుకం గొలనువెడలులేమ విటుఁడు వె
న్కొని యొకబిసతంతువునం, దనువు దవులు వ్రేసి పట్టు దా నన నిలిచెన్.

53


ఉ.

క్రొవ్వున నప్పయోరుహముఖుల్ జలఖేలన మట్లు సల్పఁగాఁ
ద్రెవ్వినహారరత్నవితతద్యుతికాంతుల మ్రింగి పూఁతలుం
బువ్వులుఁ జూపుచున్ బయలు వూనె సరోవరసంఘ మట్లపో
యెవ్వఁడు నల్పలాభమున కేల వహించుఁ బరార్థలాభమున్?

54


చ.

అతివలు పల్లవు ల్జలవిహారము చాలిచి నిర్గమింపఁ బ్ర
చ్యుతవివిధాంగరాగకుసుమోత్కరభూషణభూషితంబు లా
యతపరిమర్దనిర్దయహఠాకృతికంబులు నై కొలంకు లు
ద్ధతసురతాంతముక్తమృదుతల్పతలంబులుఁ బోలెఁ జూడఁగన్.

55


క.

ఖేలనము చాలి వెడలెడు, నాళీకవిశాలలోచనం బాయుటకుం
జాలక తారును వెడలెడు, పోలిక మునుమును తరంగములు దరి కెక్కెన్.

56


ఉ.

త్రస్తకురంగలోచనలు దర్పకముద్రలు చాటుగాఁ గృత
స్వస్తికహసయుగ్మములఁ జన్నులు చెక్కులు గప్పి పార్శ్వప
ర్యస్తకచాగ్రభాగముల నంబుపరంపర జాఱ నంసవి
న్యస్తనతాస్య లై వెడలి రంబురుహాకరతీరభూమికిన్.

57


ఆ.

సతులమేన గాఢసంశ్లేషసుఖమున, నార్ద్రతరము లైనయంశుకములు
కరఁగిపోయెఁ గాక కాదేని ప్రకటంబు, లగుట యెట్లు వారియవయవములు.

58


తే.

వర్ణమాత్రంబునన కాక వారిదముల, వర్షగుణమున గెలువంగ వలసి పోలె
సూటిధారాళవర్షంబు చూపె నపుడు, కరనిపీడితకామినీకచభరములు.

59


తే.

బహురసార్ద్రతఁ దము వంటి పాయలేని, వసనములు డించి సతులు నీరసము లైన
క్రొత్తమణుఁగులు వేడ్క గైకొనిరి యహహ! ప్రియము గైకోరునూతనప్రియలుసతులు.

60


చ.

స్మరపరిదత్తహస్తములు సర్వసమీక్షణభాగధేయముల్
తరుణిమరత్నసానువులు దర్పకదర్పలతావసంతముల్
వరహృదయానురాగరసవార్ధివివర్ధనపూర్ణచంద్రమః
కరములు వేడ్కఁ గైకొనిరి కాంతి లలంకరణంబు లయ్యెడన్.

61

సూర్యాస్తమయవర్ణనము

తే.

శ్రీసమగ్రత నట్ల కైసేసి యున్న, సుందరీజనముల కర్థిఁ జూపఁ దగిన
యరుణమణిమయ మగునిల్వుటద్ద మయ్యె, నప్తగిరిపేరిపేటియం దహిమకరుఁడు.

62


తే.

శాంతి దిగఁబాఱఁ బ్రాచిముఖంబునందు, బద్మినీముఖవికసనప్రౌఢి సడలె
భానుఁ డప్పుడు మధ్యస్థభావ ముడిగి, కాంక్ష నపరానుషక్తి రాగము వహింప.

63