పుట:కవికర్ణరసాయనము.pdf/60

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నునుఁగంబములఁ జూచి నునుగంబములయందుఁ, గంకణాంగదములు గానఁ జూచు
వికచాబ్జములఁ జూచి వికచాబ్జములయందు, శుభదోర్ధ్వరేఖలు చూడఁ జూచుఁ


గీ.

దరుణమృగలోలనేత్ర సంతతముఁ దనదు, చిత్తసింహాసనము నధిష్టించియున్న
యధిపమన్మథుభువనమోహనము లైన, యవయవంబులు చెలి గన్నయట్ల యైన.

78


చ.

చెలుల మొఱంగి యేకతమ చెన్నున హస్తములందుఁ దూలికా
ఫలకముల న్వహించి తనభావములోఁ బతిరూపు వ్రాయఁగాఁ
దలఁచి లతాంగి చిత్రముగఁ దా నవిచేష్టతఁ జిత్రరూప మై
నిలిచెఁ దదాకృతిస్మరణనిర్వృతిచే వివశాంతరంగ యై.

79


చ.

వదనము వ్రాసి తోన గరువంబునఁ జుంబనకేళి సల్పుచున్
హృదయము వ్రాసి తోన నిలు వేది కవుంగిటఁ జిక్కఁజేర్చుచుం
బదములు వ్రాసి తోన కరపద్మములం బ్రియ మార నొత్తుచు
న్సుదతి పతి న్లిఖించు మఱి చూడ నెఱుంగదు కోర్కి పెక్కువన్.

80


వ.

ఇట్లు తీవ్రంబు లగుకోర్కులత్రొక్కునం జిక్కువడి యక్కన్య తనలోన.

81


ఉ.

మారునిచేతిఘాత నభిమానమువోక సఖీజనంబుచే
నారడి గప్పిన న్వలపు లంగడి కెక్కక కోరినప్పుడే
కూరిమివల్లభుం గలసి కోర్కి ఫలించి సుఖించుకన్నియ
ల్భారఫునిష్ఠఁ బూని తొలుబాములనోముల నేమి నోఁచిరో?

82


ఉ.

వల్లభుపేరఁ జిత్తరువు వ్రాసినరూపముఁ జూచినంత నా
యుల్లము నీర మై కరఁగుచున్నది నిక్క మతండు వేడ్క రం
జిల్లఁ గవుంగిటం బిగియఁ జేర్చినయేని యురంబుపైఁ దనూ
వల్లియు నేను బెంజెమట పట్టఁగ బిట్టు గరంగి పోవనే.

83


క.

అని మఱియుఁ బెక్కుకోర్కులు, దనమదిఁ బైకొనఁగ వెలఁది దరళోర్ముల నాఁ
గినయట్ల యోర్చి చెలులం, గననీక వెలుంగుచుండెఁ గన్నియ యంతన్.

84


చ.

ఉదయమె కాని యస్తగతి నొందక తీవ్రగతి న్వెలుంగున
మ్మదనభుజప్రతాపరవి మండఁగ విప్పుడు మో డ్పెఱుంగమి
న్నిదురకుఁ బాసి యచ్చెలువనేత్రమహోత్పలము ల్జయించె నె
ల్లిదమున రాత్రు లెల్ల ముకుళించు విస్ఫురదంబుజంబులన్.

85


ఉ.

అంగన కౌను యౌవనసహాయమునం గయిచేసినట్ల నేఁ
డంగజుప్రాపుఁ గల్గి యఖిలాంగము లేన యలంకరింపఁగా
నంగములందు నేల యివి యంచుఁ గృశత్వ మహంకరించి తా
నంగదకంకణాదు లగునాభరణంబులఁ జార్చె నింతికిన్.

86