పుట:కవికర్ణరసాయనము.pdf/20

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

 విస్రస్తాకులవేణిబంధములతో విభ్రష్టసంవాస లై
ఘస్రాంతంబున వాడుతమ్ములగతిం గై వ్రాలి వక్త్రప్రభా
విస్రంభంబు లడంగ నవ్విభుసతు ల్వే వచ్చి నేత్రాంబుజా
తాప్రాధౌతపయోధరద్వయతటీవ్యాలిప్తకాశ్మీర లై.

47


క.

రోదనముతో వసిష్ఠుని, పాదంబులమీఁద వాలి పతిభిక్షము దం
డ్రీ! దయసేయుము నావుడు, నాదర మొప్పఁగ మునికులాగ్రణి యాత్మన్.

48


ఉ.

ఇంచుక చింతఁ జేసి నృపుఁ డీదశ నేమిట నొందె నేమి సే
యించిన నేమి పుట్టె? నగునే? యిఁక నిన్నియు నేల? యేను జే
యించినయిష్టియం దహహ! యీయవకార్యము పుట్టు టెట్లురా?
యంచు నహంకరించి తనయాత్మ గుణించి తలంచె నింద్రునిన్.

49


శా.

ఆకర్షించిన దేవభర్తయు జగం బాశ్చర్యహర్షంబు లు
ద్రేకింపం దనుఁ జూడ నాత్మగుణగాత్రప్రౌఢగంధర్వయో
షాకంఠధ్వనితాళవృంతరనాచాతుర్యహేవాకప
న్నాకశ్రీమణికంకణోల్లసదమందక్రేంకృతుల్ ప్రోవఁగన్.

50


గీ.

వచ్చినపుడ భక్తి నచ్చటివా రెల్ల, నవనియందుఁ జాఁగి యవనతులుగ
నర్హమణిమయాసనాసీనుఁ డై మౌని, తన్నుఁ దలఁచినట్టితలఁపుఁ దెలిసి.

51


ఉ.

నన్ను గుఱించి మీరు సవనం బొనరించితి రిందుఁ గల్మషం
బెన్న నొకండునుం గలుగ దివ్విభుఁ డివ్విధి నీల్గునట్లుగా
మున్నొకమౌని దిట్టుటయు మోసము నేఁ డిటఁ గల్గె పైన నే
ని న్నృపుప్రాణము ల్మరల నిచ్చితి నిమ్మునినాథునానతిన్.

52


మ.

అని లోకంబుల కెల్ల నద్భుతముగా నాభూవిభుం బ్రాణయు
క్తుని గా దీవన లిచ్చి తా నిజకరాంగష్ఠంబు తద్బాలవ
క్త్రనిపిష్టంబుగఁ జేయ వాఁడును సుధాప్రస్యందముం గ్రోలె నా
తని మాంధాతృసమాఖ్యుఁ జేసి హరి యంతర్ధానముం బొందినన్.

53


గీ.

జాతివేదుండు వీజనశక్తిఁ బోలె, నుష్మకరుఁడు తపర్తుసంయుక్తిఁ బోలె
నక్కుమారుండు జాతకర్మానుషక్తి, సమధికాశ్చర్యధుర్యతేజమునఁ బొలిచె.

54


సీ.

కనుఱెప్ప లిడ నెఱుంగనిచూడ్కిఁ జూచుచు, జిగివీఁపు దోఁప బోరగిలఁ బడుచుఁ
గరజానువులఁ జతుశ్చరణుఁ డై తిరుగుచు, శిశునిదర్శితదృఢస్నేహుఁ డగుచు
భాసురమితపదన్యాసంబు చూపుచు, హ్రదవిహారమున దుర్వారుఁ డగుచు
జనకజానందబీజత్వంబు గైకొంచు, గుణములముసలి నాఁ బ్రణుతిఁ గనుచు


గీ.

వసననిరపేక్ష నిచ్ఛాప్రవర్తి యగుచు, హయసమారోహణంబు సేయంగఁ గలిగి
రాసుతుఁడు దనశైశవక్రమదశావ, తారములచేతఁ బూరుషోత్తమతఁ దెలిపె.

55