పుట:కవికర్ణరసాయనము.pdf/12

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


స్థలమున రంగధామసహితంబు వసించెద నంటిఁ గావునన్
నిలిచెద నీకవేరసుతనిర్ఘరమధ్యమునన్ విభీషణా!

85


క.

కావున గతశోకుఁడ వై, నీ విప్పుడు లంక కరిగి నెమ్మది రాజ్య
శ్రీవిభవ మనుభవింపుము, నావుడుఁ గడుదైన్యమునఁ బునఃప్రణతుం డై.

86


గీ.

పుండరీకాక్ష! యిచట నీ వుండు దేని, లంక యేటికి! సామ్రాజ్యలక్ష్మి యేల?
నాకు సర్వంబు నీపాదనలినయుగమె, యుండఁ గలవాఁడ నేను నీయొద్దఁ గొలిచి.

87


శా.

కల్పాంతావధికంబు నాకు మును లంకారాజ్య మాయుష్యముం
గల్పించె న్రఘుభర్త మోక్షపద మాకాంక్షింప శేషాహిరా
ట్తల్పు న్నిన్నిటు లిచ్చినాఁడు కృపతోడ న్వేదశాఖాశిఖా
కల్పత్వత్పదపల్లవంబులకు నేఁ గాఁజాల దూరస్థుఁడన్.

88


సీ.

అనవుడు వత్స! యి ట్లగు నైన నాయాజ్ఞ, సేయంగవలయుటఁ జింత యుడిగి
లంకాధిరాజ్యపాలకుఁడ వై యుండుము, నలువ దినావసానముల నెల్ల
జనుదెమ్ము ననుఁ గూడి సత్యలోకమునకు, రెండు పరార్థముల్ నిండినపుడు
కొనిపోదు నాతోన నిను నిత్యపదమున, కట్ణౌట లంక కీ వరుగు మిచట


తే.

నుండునట్లుగ నినుఁ జూచుచుండువాఁడ, నెపుడు లంకాభిముఖుఁడ నై యీవు నరులు
గూడి యిచ్చోట నుండుట గూడ దనిన, దనుజకులనాయకుండు నొం డనఁగ నోడి.

89


వ.

ప్రదక్షిణపూర్వకంబుగా సాష్టాంగదండప్రణామం బాచరించి శ్రీరంగవల్లభుపదార
విందంబులు నిజశిరోభాగంబున దృఢంబుగాఁ జేర్చుకొని బాష్పధారాళలోచనంబుల
నంతంత మరలిమరలి సేవించుచు నెట్టకేనియు విభీషణుండు మంత్రిసమేతుం డై
లంకకుం జనియె ననంతరంబ ధర్మవర్మాదిచోళరాజపరంపరాపూజితుం డై యనాలోచిత
విశేషాశేషజగజ్జనంబులకు మోక్షసత్రప్రదానం బొనరించుచు నుభయకావేరీమధ్యం
బునఁ జంద్రపుష్కరిణీతీరంబున శ్రీరంగనామధేయదివ్యగృహస్థుం డై యుండుటం జేసి.

90


సీ.

అపవర్గకాంక్షచే నాఁకొన్నవానికిఁ, దంగేటిజున్ను శ్రీరంగశాయి
నిర్వాణదారిద్ర్యనిర్విణ్ణుఁ డగువాని, ముంగిటిశేవధి రంగశాయి
సంసారమలవిమోచనము నాకాంక్షించు, పంగువుపై గంగ రంగశాయి
పరమార్థలాభతత్పరుఁ డైనవానికి, ముంగొంగుపసిఁడి శ్రీరంగశాయి


తే.

బెదర కాఁకటియమృతంబుఁ బిదికికొనఁగ, శృంగములు లేనిమొదవు శ్రీరంగశాయి
కోరువారలకోర్కు లీఁగోరివచ్చు, జంగమామరతరువు శ్రీరంగశాయి.

91

షష్ఠ్యంతములు

క.

ఈదృశగుణనిధికి మహా, హ్లాదసుఖాకారసంవిదమృతాంబుధికిన్
వేదాంతనేతినేతిస, మాదీష్టనిషేధవిషయితాత్మావధికిన్.

92