పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/116

ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర విజయము

విఘటికలమీఁద యాత్రకు యోగ్యసమయమని ముహూర్తముంచెను.ఆ సమయమున కుటుంబముతో బైలుదేరుట క్షేమకరము కాదనియెంచి, రాజశేఖరుఁడుగారు పొరుగింట నొకవస్త్రమును దానిలో చుట్టబెట్టి యొకపుస్తకమును నిర్గమనముంచి తెల్లవారినతరువాతనే బైలుదేరుటకు నిశ్చయించిరి. అప్పుడు రామమూర్తిగారు బండినిమిత్తము వర్తమానముపంపఁబోఁగా వలదని వారించి బండినెక్కి పోయినయెడల యాత్రాఫలము దక్కదుగాన కాలినడకనే పోయెదనని రాజశేఖరు@ండుగారు చెప్పిరి. ఆ రాత్రియే వారికందఱికినిఁక్రొత్తబట్టలు కట్టఁబెట్టి, రామమూర్తిగారు ప్రాతఃకాలముననే వారికంటే ముందుగాలేచి వారు ప్రయాణమగునప్పటికి సిద్దముగా నుండిరి. అప్పుడు రాజశేఖరుఁడుగారు తాము ధవళేశ్వరమునుండి తెచ్చిన పాత్రసామగ్రియు, మంచములను, బట్టలపెట్టెలను తాము మరల వచ్చువరకును భద్రముగా జాగ్రత్తచేయవలయునని రామమూర్తిగారికి చెప్పియెప్పగించి, దారిప్రయాణమునకు ముఖ్యముగా కావలసిన వస్తువలను మాత్రము తమతో నుంచుకొనిరి. మాణిక్యాంబ మొదలగు వారు బైలుదేఱునపుడు రామమూర్తిగారిభార్య వీధివరకును వచ్చి వారు దూరదేశయాత్రను జేయయఁబూనుటను దలఁచుకొని కంటఁదడిబట్ట మొదలుపెట్టెను.అప్పుడు వారందఱును గుమ్మములోనున్నవారి యొద్ద సెలవుపుచ్చుకొని, ఒంటిబ్రాహ్మణుఁడెదురుగా వచ్చుచుండగా నతఁడు పోవువరకును నిలిచి యావల నొక పుణ్యస్త్రీ రాఁగా మంచిశకున మయినదని దారిపొగి నడువనారంభించిరి. రామమూర్తిగారు వారి నూరిబయలవరకును సాగనంపి దూర దేశప్రయాణమును జేయుచున్నారుగాన భద్రముగా వెళ్ళుడని బుద్ధులుచెప్పి వెనుకకు మరలి యింటికివచ్చిరి. రాజశేఖరుఁడుగారు త్రోవపొడుగునను చెట్లుమొదలగువానిని భార్యకును బిడ్దలకును జూపుచు దారినడువసాగిరి.