పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/23

ఈ పుట ఆమోదించబడ్డది

భూమిక

బ్రస్తావించిన నాఁటి కొలువుకూటమున విజయరాఘవ పుత్రుఁడు మన్నారు దేవుఁడు, మన్నారుదేవుని పుత్రుఁడు చెంగమలదాసు గూడ నున్నట్లు రంగాజమ్మ వర్ణించినది. చెంగమలదాసు గూడ కొలువుదీఱి కూర్చుండు నంతటి వాఁడై యుండఁగా విజయరాఘవుని వయస్సు తృతీయపాదమున బడియుండును. ఒకవేళ చెంగమలదాసు పుత్రుఁ డన్న వాదము సరి యైనను జిక్కు లేదు. 'నిరవద్య చరిత్రులగు పౌత్రులును' అని పౌత్రు లెందఱో వాకొనఁబడిరి. వీరి విశేషణము గమనింపఁదగినది. చరిత్రప్రశంస వీరు బొత్తిగా బాలురు కాదనుటకు సాక్ష్యము. కావున నీకృతి 1650 పైనఁ బుట్టి యుండవలెను.

పై సందర్భముననే శతక్రతు చతుర్వేది శ్రీనివాస తాతాచార్యులను, దండనాథుఁడు విజయవెంకటపతిని, తోటి కవయత్రి కృష్ణాజమ్మను బేర్కొన్నది. అవతారికను, షష్ఠ్యంతములను బట్టి చూచిన, శ్రీనివాస తాతయాచార్యు లనిన విజయరాఘవ రంగాజమ్మలకుఁ బరమభ క్తి యని తెల్ల మగుచున్నది. రాజగోపాలస్వామి సరేసరి. వారి కులదైవము. విజయరాఘవుఁడు మన్నారు దాసుఁడు; కొడుకు మన్నారుదేవుఁడు; మనుమఁడు చెంగమలదాసు; గోత్రము మన్నారు. సభాభవనము రాజగోపాలవిలాసము.

రంగాజమ్మ కృతిభర్త వంశావళిని మన్నారుదాసవిలాస ప్రబంధములో వివరముగా విశేషించి యిచ్చుటచే నిందుఁ గ్లుప్తముగా నిచ్చుచుంటి నని, కృష్ణప్ప, తిమ్మ, తిమ్మప్ప, చెవ్వ, అచ్యుత, రఘునాథ, విజయరాఘవ నాయకుల వరుస నొక టిచ్చినది. ఇది పూర్వము నుండి యుత్తరోత్తరము పితృపుత్ర న్యాయముగ గ్రహింపవలెను. చివర విజయరాఘవనాయకుని పుట్టుకను జాలఁ జమత్కరించి యల్లినది. రఘునాథనాయకుఁడు వసుదేవనందుల యాత్మ లఁట. చెంజి లక్ష్మి దేవకియుఁ, గళావతమ్మ యశోదయు నఁట. కస్తూరి రంగఁడు