పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/407

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

175


ఉ.

ఏలరె? మున్ను భూపతు లనేకులు రామయయాతిముఖ్యు లీ
నేలయ నీవు ప్రోచునది నేలయ యిట్టియశంబు నిట్టియు
త్తాలతరప్రభావమును దన్నృపు లొందిరె నీక్రియన్ మహీ
పాలలలామ? నీకయిన భాగ్యము వర్ణన సేయ శక్యమే?

235


శా.

నీవున్ జేరమభూనరాదులగతిన్ నేత్రక్రియోద్భాసిలో
కావాసుం గరిచర్మవాసు భువనైకారాధ్యు నిమ్మేనితో
సేవావృత్తిఁ బ్రసన్నుఁ జేసి దిశలన్ శ్రీపూర్ణ సత్కీర్తి పు
ణ్యావేశంబున నిల్పగాఁ గలవు తథ్యం బిందువంశాగ్రణీ.

236


చ.

అనుడుఁ గృతప్రణాముఁ డయి యగ్గురు నిట్లని పల్కు ముంజభో
జనృపతి యిట్లనం దగునె శైవగురూత్తమ! నీకృపారసం
బునఁ దగఁ జెట్టుగట్టు వనువొందుట చిత్రమె మంగళంబు లె
ల్లను సుకృతాధిపుం గొలుచులాభము గల్గినఁ గీర్తి గల్గదే?

237


ఆ.

చెలఁగి పుత్త్రనిర్విశేషంబుగా నన్ను
బ్రోచు నీ ప్రభావమునన గాదె
ఇట్టి వైభవంబు నిట్టి సౌభాగ్యంబు
దొరకె నాకు నిఖలగురువరేణ్య.

238


ఉ.

వారక వ్రేలు నాకి యువవాసఫలం బెడలించునట్లు ని
స్సారములైన యిజ్జగతిసౌఖ్యములన్ మది దూర్వ్యయ మొంది వి
స్తారియఘంబు దూరమని శంకవహించియు మీయనుజ్ఞకుం
దారక పూనినాఁడ వసుధాభరమున్ గురుచంద్రశేఖరా!

239


ఉ.

సేవకలోకముం బొదలజేయుటకై చరకల్పభూరుహ
శ్రీవహియించు నీపదముఁ జేరినవాఁడఁ గృతార్థుఁ జేసి సం
భావనఁ బ్రోవు నన్ను భవబంధముపైఁ దగు లూడ్చి నావుడున్
భూవరుఁ గ్రమ్మఱంబలుకు భూనుతుఁ డుద్భుటమూర్తి యీక్రియన్.

240