పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/343

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

అన విని సంభ్రమంబున దయాకరమూర్తి మహీసురుండునుం
దనమది హెచ్చరింప మును దత్తనపుం దడవంగఁ గొన్ని ని
ల్చినసలిలంబులన్ రసనఁ జిల్కుచుఁ గుత్తుక డెక్కు (నంతనం
తన సరిచేసికొంచును యథాస్థితి నూనఁగఁ జేసెఁ బ్రాణమున్.

249


ఆ.

అట్లు సేదదేఱి యల్లన చే గాలు
గదలనిచ్చి వదనకమల మెత్తి
కనులు విచ్చి చూచి గ్రక్కున లేచి కూ
ర్చుండి మాటలాడుచుండ నంత.

250


సీ.

తెలిసి యం(తట ధరిత్రీదేవకులనావ
        కుండు) విద్యాపాలుదండ వినతి
చేతఁ బ్రీతునిఁ జేసి చేదోయి మొగుడించి
        వినయావనమ్రుఁడై యనియె నతని
ననఘాత్మ! నీకతంబున నిప్పటికి బ్రాణ
        మున నుండ గంటి నీమూర్తి చూచి
సకలాంగకంబులు చల్లనయ్యెను నాకు
        (నిజవృత్త మెఱిఁగింతు) నీవు వినుము


గీ.

జాతివిప్రుండ వాదంబుచేత నోడి
సిగ్గుపడి శాస్త్రపాఠంబు సేయఁ గోరి
పోవుచున్నాఁడ నెటకై నఁ బోయి పోయి
అగ్గిదాఁకితి నిచ్చోట నైతి నిట్లు.

251


ఉ.

నామదిఁ దోఁచుచున్నయది నాయన! నీవు దలంప సర్వవి
ద్యామయమూర్తి వంచు ధృతి దప్పక నీపదపద్మయుగ్మమున్
బ్రేమ భజించి శాస్త్రములు పెక్కువతోఁ బఠియించి ప్రోడనె
భూమిజనైకవంద్యగతిఁ బొల్చెద నిల్చెదఁ గీర్తిసంపదన్.

252