పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/331

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

ఉద్భటారాధ్యచరిత్రము


సీ.

మదిరాక్షి! నీముద్దుమాట లాలించిన
        పారఁబట్టనె పికస్ఫారరమణి
యెలనాఁగ! నీముఖం బింత చూచినమాత్ర
        వెలవెలచేయనే విధువిభూతి
హరిమధ్య! నీవదనానిలంబులు గ్రోలి
        కలఁచి తూలించనే కమ్మగాడ్పు
కొమ్మ! నీకమ్మనికెమ్మోవిఁ జుంబించి
        చిదిమివైవనె మావిచిగురుటాకు


గీ.

మత్తగజయాన! నీ మేను హత్తియుండి
పెలుచ నాకులపఱుపనే యలరుఁదీవ
నీయుపేక్షణ నా కింత నిబిడితాప
మానవలసె వివేకంబు మానవలసె.

191


గీ.

అనుచు నసమాశుగాశుగాహతుకఁ జేసి
చిత్త మెరియంగ వెన్నెలచిచ్చు సెగలఁ
గ్రాఁగువిప్రున కజకల్పకల్ప మగుచుఁ
గడచె నాఱేయి యంతటఁ బొడిచె నినుఁడు.

192


గీ.

దినముఖోచితకృత్యముల్ దీర్చి యంత
వచ్చి పరభావవేది భావజశరాగ్ని
నవశుఁడై యున్నసఖుఁ జూచి యాత్మ నులికి
యతని మెల్లనఁ దెలిపి యూరార్చి వలికె.

193


క.

వాలికలగు తెలిగన్నుల
బాలికకై యింత వంత బడలఁగ నేలా?
తూలి కడువైభవంబుల
కేలిక విఁకఁ గమ్ము నిన్ను నింతిని గూర్తున్.

194