పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/292

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

59


మ.

పరభూపాలురదైన్యముం నిజబలప్రాచుర్యమున్ నిశ్చయిం
చి రసామండలి ధాన్యముం ధనము లక్షీణంబు లై యున్కికిన్
బరితోషంబు వహించి మూలనగరిన్ భవ్యాత్ములం రక్షణ
స్థిరులం జేసి మహీమహేంద్రుఁడు దలంచెన్ గాశికిం బోవఁగన్.

27


ఆ.

అమ్మహీధరుండు ప్రాణేశ్వరియుఁ దాను
హారిశిల్పమైన యరద మెక్కి
విశ్వనాథుపురికి విజయంబు చేసిరి
పుత్త్రకాంక్ష హృదయ మాత్రపడఁగ.

28


చ.

శ్రవణవుటాభిరామమృదురావములన్ విలసిల్లి లోచనో
త్సవకరమైన తేరు జలజాతవిరోచనతోడ నెక్కి భూ
భువనవిభుండు వొల్చె మణిపుష్పక మెక్కి వినోదలీలలన్
దవిలి శచీపురందరులు ధారుణిపై విహరించుకైవడిన్.

29


సీ.

కమనీయకల్లోలకలితఘనాంభోధి
        కడఁగి వేలాకాంతఁ గౌఁగిలించె
బరిమళంబును శీతభావంబుఁ దలచూప
        మందగంధవహంబు మలసె దిశల
అతినిర్మలాకారుఁడై వలిమలఱేఁడు
        చలువమించు దొలంకుచాయ లీనె
గంధర్వభామినీగాంధర్వములఁ గూడి
        సురవుష్పవృష్టియుఁ గురిసె మింట


గీ.

వినుతవిలసనశిఖలచేఁ దనరె వహ్ని
యవని సంపూర్ణసౌభాగ్య మావహించెఁ
గాశికాభర్త గౌరీశుఁ గాలకంఠు
నమ్మహీపతి సేవింప నరుగువేళ.

30