పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/250

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

17


ఉ.

వాసన లేనిపూవు, రసవర్ణనలేని కవిత్వరేఖ, య
భ్యాసము లేనివిద్య, జలజాప్తుఁడు లేనిదినంబు, చంద్రికో
ల్లాసము లేనిరాత్రి, కమలస్థితి లేనికొలంకు చూవె కై
లాసనివాసు నాత్మఁ దలంపని మూఢులజన్మ మారయన్.

68


గీ.

చూడఁదగదే వివేకించి సుజనులకును
జంద్రరేఖావతంసుని చరణయుగళి
యెంతచక్కనిదో? రమాకాంతుఁ డంత
వాఁడు నందును దన కన్ను వైచె మున్ను.

69


గీ.

శైవులగువారు చెప్పినజాడయందు
నడువనేరదు మూఢుల గడుసుబుద్ధి
వానపై వాన గురిసిన నానునొక్కొ?
సహజకాఠిన్య ముడిగి పాషాణకులము.

70


సీ.

శివపదాంభోరుహప్రవిమలోదకపాన
        సిద్ధి నాలుకవిఁ జెలఁగదేని
శంభుదాసాంగైకసంస్పర్శనంబున
        నెమ్మేను పులకల నిలుపదేని
త్రిపురదానవవైరి దివ్యలింగస్ఫూర్తి
        కన్నులారఁగఁ జూడఁ గలుగదేని
దర్పకధ్వంసియౌ దలనిడ్డ పూవుల
        తావిపై నాసిక దవులదేని


గీ.

కాలకంధరు సత్కథాకర్ణనంబు
కర్ణపుటవీధి నందంద కదియదేని
వాని జన్మంబు జన్మమే వాని బ్రతుకు
బ్రతుకె హరదూరుఁడగువాఁడు పశువు దెలియ.

71