పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/385

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉ. ఇందునిభాస్య నీవదన మెత్తి తగన్ నిగిడింపు చూడ్కులన్
ముందఱివంక మిన్నక సమూహములై సమదాలిపోతముల్
సందడిసేయ లోకములఁ జంద్రయుగంబును గల్గఁబోలునన్
సందియముల్ సమస్తజనసంతతి కాత్మల నొందఁజేయుచున్. 71

ఉ. ఈ నరనాథవర్యుల యహీనకులస్థలనామవర్తనల్
నే నెఱిఁగించెదన్ విని యనిందితసుందరు నిందు నొక్కనిన్
మానవతీలలామ యనుమానము మాని భవత్కటాక్షవీ
క్షానవదామపాతపరికల్పనచేతఁ గృతార్థుఁ జేయవే. 73

చ. చెలువ త్రికూట నామగిరిశేఖర మాలిక వోలె లంక నాఁ
గల దొక పట్టణం బుదధిగర్భమునన్ దనుజాస్పదంబు ని
ర్మలతదగారకుట్టిమసమగ్రహరిన్మణిరుక్సరోజినీ
స్థలములఁ బూర్ణిమావిధుఁడు దాల్చు మరాళకిశోరఖేలలన్. 74

ఉ. ఏ పురమున్ దశాననుఁ డహీనభుజాదశయుగ్మకంబుచేఁ
బ్రాపిత(ఖే)[1]దుఁడై వికచపద్మవిభానన తాల్చు నట్టిలం
కాపురమున్ విభీషణుఁడు గైకొనె లీల భుజాయుగంబుచే
స్థాపితరామభూపజయశాసన మాతఁడు దక్షిణాశకున్. 79

ఉ. వాని తనూభవుం డితఁడు వారిరుహేక్షణ! చూడు మాతనిన్
వీని యనన్యరూపతనువిభ్రమముల్ వివరించి చూచి కా
దా ననవింటిజోదు మును తాల్పకయుండుట క్రూరభర్గఫా
లానలదగ్ధ మైన తనయంగకమున్ సుర లెంత వేఁడినన్. 80

క. తరుణీ! యీతని డాఁపలి
కురు వెక్కెదవేని నీదు కోమలచరణాం
బురుహామలనఖకాంతులు
సురకాంతలమౌళిఁ జేరు చుక్కలఁ జేరున్. 84[2]



  1. ప్రా.పూరణము
  2. 71, 73, 79, 80, 84 పద్యములు ప్ర.మ.భు.లో 517, 520, 521, 523 515 సంఖ్యగల పద్యము లాధారముగా పరిషత్ప్రతియందలి లుప్తభాగములు పూరింపఁబడినవి.