పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/179

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. మేలి గొజ్జంగిపూ మేలుకట్టునఁ గూడ
సతియోర్తు మత్యాలచవికెఁ గట్టె
సన్న సున్నము సేసె సతి యోర్తు చందన
కర్దమంబునఁ గరకావితర్ది
కాంత యొక్కతె గాజకంబాన ఘటియించె
నొప్పుకప్పురముల నొరఁగుటరఁగు
తరుణి యొక్కతె చేర్చెఁ దలిరాకు పాన్పుపై
విరిక్రొత్తచెంగల్వ విరితలాడ
తే. కదలికాగర్భదళభస్త్రికాహిమాంబు
నికరముఖమున నాడించు వ్రేలఁ ద్రుంచి
పట్టునట్టుగ నొకలేమ పట్టెనెదుటఁ
జారుశశికాంతమణిశిలాసాలభంజి. 77

ఉ. కాంతయొకర్తు సన్నె[1] బిసకాండములం గుసుమాంబుదీర్ఘికా
ప్రాంతమునందుఁ బ్రోదికలహంసలఁ బూనెడి వారియంత్రముల్
వింతగ గాజగంధమున వెల్వడి చందనసౌధవిథికా
భ్యంతరచంద్రపుష్కరిణియందుఁ బడన్ పడి వారిపూరముల్. 78
 
ఉ. చందనగంధియోర్తు ఘనసారముఁ గెఱ దీర్చి లోనలిం
జెందొగఱేకులన్ రసులు చేర్తి బిసప్రసవంపు మొగ్గలం
బొందుగఁ దూములిడ్డహిమపూరతటాకము క్రింద లీల నా
టె దగ దమ్ముసేసిన పటీరములో మరువంపుమొగ్గలన్. 79

చ. వికసితమాధవీభవనవీథిని నిర్మలచంద్రకాంత వే
దికపటిఁ గొత్త(లేఁ) బొరలఁ దీర్చిన పానుపుమీఁద ఫుల్లహ
ల్లకదళరాజి విచ్చి మదలాలసగామిని యోర్తు చల్లెఁ గొం
చక హిమవాలుకామిళిత చందనశీతలవారిపూరముల్. 80



  1. చన్నె