పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/167

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉ. ఏమని చెప్పవచ్చు ధరణీశ్వర తత్తమతాపగౌరవం
బామదిరాక్షి మేన నిగురారెడు[1] తాపభరంబునన్ గృహా
రామ(సమీరముల్ సెగలుగ్రక్క వనీస్థలి కేఁగె నెచ్చెలుల్
నేమఱుఁబోకు పోకు మని) పెక్కుతెఱంగుల బుద్ధి చెప్పి(నన్).[2] 38
 
ఉ. జీవము వచ్చి చైత్రరససిద్ధిఁ దగ న్నడయాడు కమ్మఁ బూఁ
దీవలప్రోవులో యన రతిప్రియమూర్తి మదస్త్రవిద్యలో
వావని కాదిదేవతలొ నాఁ దను గూడి విలాసవిభ్రమ
శ్రీ వెలయించి రింపెసఁగఁ జేడియ లవ్వనమెల్లఁ దారయై. 39

సీ. మొకరితుమ్మెద మూతి ముట్టని నవకంపుఁ
గ్రొవ్విరుల్ మేలేర్చి కోసికొనుచు
గండుఁగోయిల నోరఁ గమిచి త్రుంపని మంచి
చెలువంపులేఁబొరల్[3] చిదిమికొనుచు
బికకీరములు నాలిఁ బెనఁగి మూచూడని[4]
తనిగమ్మపండులు దరిగికొనుచు
నొలసి తెమ్మెరలు తావులు గమ్మరింపని
వఱు పూఁదేనియల్ వడిచికొనుచు
తే. భానుకిరణంబుచే నంటుపడని పుష్ప
కేసరంబులుఁ బుప్పొడికిసలయంపుఁ
బుట్టికలఁ బెట్టికొనుచు నింపులు దలిర్ప
సమదగజగామినులు కేలి సలిపి రపుడు. 40



  1. నిగురాడెడు
  2. 31వ ఆకు నిలువులో సగం చిరిగింది. ఆముక్క కానబడదు. 1921వ సంవత్సరంలో లైబ్రరీలో వ్రాయించిన ప్రతిలో ఆభాగములు లుప్తములే. అంతకుముందే కవిగారు కాపీ వ్రాయించారో తెలియదు. కుండలీకరణములు పూరణములు.
  3. చెలువంబు లేఁబొరల్
  4. బికకీరములు గాటువెట్టి మూచూడని