పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/163

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉ. ఆయలినీలవేణికి మదాలసగామిని కివ్విధంబునం
బ్రాయము వృద్ధిగైకొనఁగఁ బల్మరుఁ గన్గొని దండ్రియాత్మలోఁ
జేయు విచార మీసమదసిందురయానకు నెవ్వఁడొక్కొ భూ
నాయకకోటియం దనుగుణంబగు వల్లభుఁ డంచు నెంతయున్. 18

క. అంతట నొకనాఁ డా సీ
మంతవతీమణి విహారమణిమయసౌధా
భ్యంతరమున మృదుశయ్య ని
రంతరసుఖలీల నిద్ర నందుచు నుండన్. 19

మ. కలలో నాకలకంఠి నంబుజముఖిం గన్యాలలామం బ్రియం
బలరం డగ్గరి యొక్కదివ్యపురుషుం డావేళ చేనున్న యు
జ్జ్వలపుంజిత్రపటంబుఁ జూపి సతి యీక్ష్మాపాలు వీక్షింపు మో
పొలఁతీ యీతఁడు నీకు భర్త యనుచుం బోయెం దిరోధానమై. 20

ఉ. పోవుడు నంతలోపలనె భూవరనందన మేలుకాంచి య
బ్భావభవోపమానుఁడగు పార్థివనందను చిత్రరూపమున్
భావములోనఁ దార్కొలుప భావభవుం డది సందుగాఁ దనుం
గేవలనిర్దయుం డగుచుఁ గెందలిరమ్ముల పాలు సేయఁగన్. 21

క. కలవలపడుచు మృగావతి
కల మును గనుఁగొన్న రాజకందర్పుని యు
జ్జ్వలమూర్తి నెమ్మనంబునఁ
బలుమఱుఁ గనుఁగొనుచు రాగపరవశ యగుచున్. 22

ఉ. ఎక్కడి వేధ వచ్చెఁ బరమేశ్వరుఁ డేమి ఘటించె మాయనే
నెక్కడ యక్కుమారవరుఁ డెక్కడ లే దిది యన్న నిక్కువం
బిక్కల మర్లు గొల్పి విధి యీక్రియ వాఱడి వంతలం దనుం
జిక్కులఁ బెట్టి పూవిలుతు చేత[1] నలంప దలంపు సేసెనో. 23



  1. సేత