పుట:ఈశానసంహిత.pdf/21

ఈ పుట ఆమోదించబడ్డది

ములుగా నగపడలేదు. తొలుత బ్రాహ్మణజన్మము. అందును రాజసత్కారము. సకలశాస్త్రపారంగతత్వము. వీనినెల్లఁ బాఱఁద్రోలి వావివరుస లుజ్జగించి కంటి కగపడిన స్త్రీ నెల్ల రమించుట. దొరకిన కల్లు నెల్ల ద్రాగుట. పచ్చిమాంసము భుజించుట. దేవాలయములఁ బాడుచేయుట. చండాలి నాలిగాఁ జేకొనుట. దారిఁ గాచి గోవిప్రహత్య లాచరించుట తనకూఁతులనే దాను రమించుట. ఇట్టి మహాపాతకములు వంచనములును, తిర్యక్కులకును జెల్లవు. అట్టి మహాపాతకము లాచరించిన మహాపాపిష్ఠుఁడు, ఒడలు తెలియక కామవశంవదుఁడై తన మిండతకుఁ గల్లు మాంసము గొనిపోవుచు మార్గమధ్యమున ననిచ్ఛాపూర్వకముగ శివరాత్రివ్రతపూజాదుల నాలోకించినంతమాత్రమున విగతాఘుఁడై కైలాసమున కేఁగుట, ప్రమథత్వ మొందుట, శివున కత్యంతప్రీతిపాత్ర మగుటయును శివరాత్రిమాహాత్మ్యమునకుఁ జాలిన యుదాహరణము లని యాకవిసార్వభౌముఁ డెంచెను. ప్రతినాయకుని యుత్కర్ష మెంతయున్న వానిని జయించిన నాయకుని యుత్కర్ష మంత కధికమగును గాదా? ఆతలంపుననే శ్రీనాథుఁ డీకథను స్వకపోలమున సాధించి యటనట రసోత్తరములగు కాదంబరీవచనములఁ జొప్పించి మహోత్తమప్రబంధము రచించినాఁడు. ఇంతియేకాని తా నేసంహితను నాంధ్రీకరింపను లేదు. ఆంధ్రీకరింపఁ దలంపను లేదు.

గ్రంథరచనమున వీరిరువురదృక్పథములు వేఱువేఱుగా నగపడుచున్నవి. శ్రీనాథుఁడు రసోత్తరములగు వర్ణనములు కల్పనములు గూర్చి కథను లోకోత్తరముగావించి తద్వారమున సహృదయుల మనములందు గాఢతమభక్తిప్రరోహముల నాట నెంచివాఁడు. సంహితాకారున కిట్టిసుకుమారాలోచనము లేదు. అతఁడు మహాభక్తుఁడేకాని కేవలము జనులను మూఢభక్తులుగాఁ జేసి వారిచే వ్రతము లాచరింపఁజేయు మతప్రచారకుఁడో లేక పురోహితుఁడో కాఁదగును. కావుననే శ్రీనాథుఁడు శివరాత్రియను