పుట:ఈశానసంహిత.pdf/19

ఈ పుట ఆమోదించబడ్డది

ఈయీశానసంహితను జూచియే శ్రీనాథుఁడు శివరాత్రిమాహాత్మ్యము రచించెనని యంగీకరించుచో నా కవి యిప్పుడు మన కుపలబ్ధమైన యీప్రతిని జూచియే యాంధ్రీకరించెనని తేలును. కావున సంహితయం దెటనెట పాతములు గలవో యవి యట్లే మాహాత్మ్యమున నెట్లుండఁ గలవు? మఱియు నాలవయాశ్వాసము చివరనున్న “చిన్నబోయి యముం డేమి చేసెఁ జెపుము" యను మునుల ప్రశ్నమునకుఁ జేటభారతమంత సమాధానముండగా దాని నేల విడచును? మహాకవియగు నాతఁడు పెక్కుస్థలములందు సంహితలోని చప్పిడికల్పనములు, వర్ణనములు, కథలు మొదలగువానిని స్వప్రతిభచే సానఁబట్టినరత్నములవలె వెలయించినవాఁడు కొన్నిగ్రంథపాతములఁ బూరించుకొనలేకపోయెనా? లోపముల సవరింప శక్తిలేనివాఁడా? యని సహృదయులు విమర్శించుకొనఁదగును. కావున నీ ప్రతిని శ్రీనాథుడు చూడలేదనియు నీశానసంహిత నాంధ్రీకరింపలేదనియు నమ్మవచ్చును.

ఈశానసంహితాకాలము

పైవిషయములవలన నీశానసంహిత శ్రీనాథునికిఁ బూర్వము లేదని తేలినట్లే. అట్లయిన నిది యెప్పు డెవ్వడిచే రచింపఁబడియుండును; అని యాలోచింపఁగా నీక్రిందివిషయములు దోఁచుచున్నవి.

శ్రీనాథుఁడు మృతినొందిన పిదప అవతారికాభాగము నవతరింపఁజేసి కృతిని స్వయంగ్రహణము గావించిన మాహాత్మ్యకృతిపతియనుమతినో లేక స్వయముగనో యప్రౌఢశైవపండితకవి దీనిని రచించియుండును. ఆతఁ డీకథయందలి భక్తిచేతనైన నేమి భక్తులఁ బ్రోత్సాహ పఱుప నీగ్రంథ ముత్తమోత్తమసాధనమని నమ్మికచే నేమి దీనిని సంస్కృతభాషలోని కనువదించినాఁడు. అతనికి సంస్కృతభాషాజ్ఞానము బాగుగ లేదనియు, కవితాశక్తికూడఁ దగినంత లేదనియు నీగ్రంథము వేనోళ్ళఁ జాటుచున్నది. మహతామ్రాక్షః అధ్యా 70 శ్లో. 27 మొదలగు నపప్రయో