పుట:ఈశానసంహిత.pdf/10

ఈ పుట ఆమోదించబడ్డది

"జమిత్యాదిమాహాపురాణే శ్రీస్కాందే ఈశాసనసంహితాయాం శివరాత్రిప్రాదుర్భావతద్వ్రతపూజావిధానం నామ సప్తతమో౽ధ్యాయః" అని కలదు. దీనిచే నందలి కథయు విదితమే. తరువాత 71½ శ్లోకములు కలవు. అందు 10 శ్లోకములలో వ్రతముయొక్క ఫలస్తుతి మొదలగునవి యున్నవి. తరువాతి 61 శ్లోకములందును సుకుమారునిచరిత్రము చెప్పబడింది. అక్క-డ "అత్రగ్రంథపాతః" అని కలదు. 72 అధ్యాయప్రశంసయే లేదు. కాని చివరిఅధ్యాయము 129 శ్లోకములందు శంకరయమసంవాదము వర్ణింపబడినది. చివర "జమిత్యాదిమహాపురాణే శ్రీస్కాందే ఈశానసంహితా శంశరియమసంవాదో నామత్రిసప్తతితమో౽ధ్యాయః" అని కలదు. ఈసంహితలోని కథకును శివరాత్రిమాహాత్మ్యములోని కథకును గొన్నిమాత్రము భేదము లగపడుచున్నవి. కాని అనేకాంశములు రెంటను సమానముగానే యున్నవి. ఉన్న స్వల్పభేదములు పాఠకుల సౌలభ్యమునకై యీసొరిది నుదహరించుచున్నాఁడను.

పోలికలు - భేదములు

మాహాత్మ్యమున శివుఁడు అష్టాదశవిద్యలను దొలుత బ్రహ్మ కుపదేశించెను. అనంతరము శంకరాజ్ఞాప్రచోదితుండై కృష్ణద్వైపాయనుఁ డావిర్భవించి సర్గప్రతిసర్గాదిపంచలక్షణలక్షితంబులగు నష్టాదశపురాణంబులు నాల్గులక్షలపరిమితి గలవి రచించెను. అందుస్కాందము లక్షపరిమాణము గలది. అందు శివరాత్రిమాహాత్మ్యము గలదు. ఆశివరాత్రివ్రత మెవ్వ రాచరించి రేఫలంబులు దానం గలుగునో చెప్పుమని మును లభ్యర్థింప సూతుఁడు మొదట ప్రళయవర్ణనమును, దరువాత నారాయణుఁడు క్రోడాకారమున మహార్ణవమగ్నయగు భూమి నుద్ధరించి తన్నిమిత్తాహంకారమునఁ దానే జగత్కర్తనని గర్వించి క్షీరసాగరమునఁ పాససెజ్జపైఁ బవ్వళించియుండెను. అనంతరము స్వయంభువగు బ్రహ్మ నిద్ర మేల్కాంచి సృష్టిసేయం దలంచి క్రమము దెలియక చీకాకుపడి చివరికి శివధ్యానమున లబ్ధప్రజ్ఞుండై చరాచరాత్మకప్రపంచమెల్ల సృజించి