పుట:ఆముక్తమాల్యద.pdf/135

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

ఉర్విఁ గాదంబినుల యలయుమ్మనీరు
దొరుఁగఁ గేకులు కేకలు తోన సేసె,
ద్విజత నారణ్యకధ్వని వినఁగఁ జేసి
గర్భము సుఖచ్యుతము సేయఁ గడఁగె ననఁగ.

79


మ.

అలపర్జన్యుఁడు భానుఁ డన్కొలిమిలో నభ్రంపుఁ బెన్గొప్పెరన్
జల మాఁగన్ బిడుగుక్కుజాత్యపుటయస్కాంతంపు నత్తున్క లో
పంలఁ జూప న్మహిమీఁదిలోహరజముల్ పైఁ బర్వె నా లేచె వా
త్యలఁ బ్రాగ్దావమషు ల్మొగి ల్మొదల గ్రద్దంతై దివిన్ లేచినన్.

80


తే.

ఇలకు డిగి, చుట్టిచుట్టి దు మ్మెత్తి, యెగసి,
పోయి, తము ముంచుసుడిగాలిపుష్కరములఁ
గడలినీ రభ్రకలభము ల్గ్రాసె, ధరణి
నభ్రకరిశిక్ష దినిఁ గాంచినట్టికరణి.

81


తే.

కృతపయఃపాననవమేఘపృథుకములకు
రాలె నొయ్యన వడగండ్ల పాలపండ్లు;
మఱి బలాకాద్విజాళిసంప్రాప్తి గలిగెఁ
బెరుఁగఁ బెరుఁగంగ ధ్వనియు గంభీరమయ్యె.

82


మ.

తనతోయం బినరశ్ము లెత్త, నిల వాత్యారేణుమూర్తిన్ మహేం
ద్రునకుం జెప్పగ, మ్రుచ్చుఁ బట్ట దివమందు న్విల్ఘటింపం, భయం
బునఁ దద్రశ్మిసహస్రము న్వెస డిగెం బో డాఁగి వే గ్రుమ్మరిం
ప, ననం ధారలు దోఁచె మించు వెలిఁగింప న్మబ్పుల న్వెల్లిపై.

83


చ.

తొలితొలి వచ్చుధారల నెదుర్కొని, తచ్చటఁ దీఁగచుట్టుగా
నలముచు ధాత్రి లేచి, పొలుపారే మలీమనబాష్పవల్లు; ల
త్తొలితొలిధారకే వెఱచి; తోన ఘనౌఘము వానకాళ్ళకుం
బలరిపుఁ డాలయాభ్రముల భంగినె సంకెల లూన్చెనో యనన్.

84


చ.

ఎడపక మున్ను మింటిపయి నేతగులంబును లేక మూకతన్
వెడలెడుచోఁ గఠోరఘనబృందము లడ్డము వడ్డ, వానిమే
యిడియ జవోష్మఁ బాఱెడు రవీందులదట్టపుబండికండ్ల చ
ప్పుడుగతి, మ్రోసె రేపగలు భూరిభయంకరగర్జ లత్తఱిన్.

85