పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/36

ఈ పుట ఆమోదించబడ్డది

యుగములో శ్రీమద్రామాయణములోని రామ, రావణ యుద్ధము జరిగియున్నది. అది జరిగి ఇప్పటికి ఒకకోటి నలుబది ఆఱులక్షల పైకాలము గతించినది. అట్లుకాక కొందఱెంచినట్లు ఈయిరువదెనిమిదవ మహా యుగములోని త్రేతాయుగాంత మని యెంచినచో ఇప్పటికి తొమ్మిదిలక్షల సంవత్సరముల పైకాల మగును. శ్రీరాముని తండ్రి "దశరథుడు" సూర్యవంశపు రాజు. చంద్రవంశమునకు చెందిన "రోమపాదుడ"నెడి రాజు ఈదశరథునికి ప్రాణమిత్రుడు. వీరిద్దరును సమకాలికులు. దశరథుడు తన కొమార్తెయైన "శాంత"ను సంతానము లేని రోమపాదునకు పెంచికొనుట కిచ్చియుండెను. ఉశీనర, తితీక్షువు లనువార లిద్ద రన్నదమ్ములు. అందు ఉశీనరునినుండి ఏడవతరమువాడు "రోమపాదుడు". ఉశీనరుని తమ్ముడగు తితీక్షువునుండి ఆఱవతరము వాడు "ఆంధ్రరాజు". ఈ రోమపాద - ఆంధ్రరాజులు సమకాలికులు. రోమపాదుడు దశరథునికి మిత్రుడు. దశరథుని కుమార్తెయైన శాంతాదేవిని పెంచికొనినవాడు. అందువలన రోమపాదుడు, దశరథుడు, ఆంధ్రరాజు ఈముగ్గురు సమకాలికులు. (భాగవతము 9-685-686 చూడుడు.)

ఆర్యాంధ్రులు

ఆర్యులైన ఈ తెలుగుజాతీయులు చాల ఉదారులు. పరాక్రమవంతులై ప్రజాహితముగా చిరకాలము రాజ్యపాలన మొనర్చి యుండిరి. వారిచరిత్ర యించుక దిగువ ఉదాహరింప బడుచున్నది. ప్రాచ్యక దేశస్థులైన ఈ ఆర్యాంధ్రులను గురించి శ్రీ రామాయణము నందు సుగ్రీవుడు సీతాన్వేషణమునకు వానరులను పంపు ఘట్టమున, స్మరింపబడినది. శ్రీ దేవీభాగవతమున సుక్షత్రియుడైన సింహళదేశాధీశుడు తన కుమార్తెను ఆంధ్రదేశపు రాజున కిచ్చుటకు రాయబారములు నడిపియుండెను. భారతములో రాజసూయధ్వరము చేయు ప్రయత్నమున జరుపబడిన దిగ్విజయ యాత్రాసందర్భమున సహదేవునివలన జయింపబడిన రాజ్యములలో "ఆంధ్రదేశము" గలదు.

(సభాపర్వావాంతర దిగ్విజయ పర్వం 31 అథ్యా.)