పుట:ఆంధ్రులచరిత్ర-సంస్కృతి.pdf/10

ఈ పుట అచ్చుదిద్దబడ్డది
8

ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి


కాని, మానవశాస్త్ర (Anthropology) పరిశోధన ఫలితాన్నిబట్టి చూస్తే, ఈ వాదం నిలబడేటట్లు కనబడదు. ఇంచుమించుగా ఒక శతాబ్దికి పూర్వమే ఫ్రాంసుదేశపు గుహలలో ప్రాక్తన మానవుడు వేసిన కొన్ని చిత్రాలను, చేసిన చెక్కడపు పనిని మానవశాస్త్రజ్ణులు కనుగొన్నారు. వీటిని ప్రాక్తన మానవుడు క్రీ||పూ|| 25000 సంవత్సరాలు ఆ ప్రాంతంలో చిత్రించి ఉంటాడని వారి అభిప్రాయం. కాబట్టి తన అస్తిత్వం సుస్థిరం అయేవరకూ మానవుడు కళలు మొదలయినవాటిమీద దృష్టి సారించలేదనడం శాస్త్రసమ్మతంగా ఉన్నట్లు కనబడదు. అయితే, నాగరికత పెరిగినతరువాత మానవుడు తన సాంస్కృతిక కార్యక్రమాల్ని ద్విగుణితోత్సాహంతో నిర్వహించి ఉండవచ్చు. నేడు బహుముఖాల అభివృద్ధిచెందుతూ ఉన్న సంగీత సాహిత్య నాట్య కళలకి మూలం విస్మరించకూడదు. ఇది నాగరికత, ఇది సంస్కృతి, ఈ కాలంనుంచి నాగరికత ప్రారంభమైంది. ఈ కాలంనుంచి సంస్కృతి ప్రారంభమైంది అని ఇదమిత్థంగా నిర్ణయించి చెప్పడానికి తగిన ఆధారాలు ఇంకా లభించలేదు. కాని సంస్కృతికి అంకురార్పణ ప్రాక్తన మానవుడికాలంలోనే జరిగిణ్దని మాత్రం నిశ్చయంగా చెప్పవచ్చు. మానవుణ్ణి ప్రప్రధమంగా ఆకర్షించిన కళ చిత్రలేఖనం అనీ, చెక్కడం (దంతాలు, కొమ్ములు మొదలైన వాటిమీద బొమ్మలు చెక్కుట - engraving) కూడా తత్పమకాలికమే అనీ మానవశాస్త్రజ్ణుల అభిప్రాయం. ఏది ఏమైనా, మానవుడు నాగరకదశకు వచ్చేసరికి చాలకలం పట్టింది. కళలు, మతము మొదలైనవాటికి బీజావాపన ప్రాక్తన మానవుడికాలంలోనే జరిగింది. ఒక్క విషయం మాత్రం మనం నిస్సణ్దేహంగా అంగీకరించవచ్చు. నాగరకతకలవారందరూ సంస్కృతికలవారని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి సూక్ష్మాతిసూక్ష్మంగా పరిశీలిస్తే నాగరకతకి, సంస్కృతికి కొంత భేదం కలదు అనే సిద్ధాంతం దోషదూషితం కాదని మనం అంగీకరించాలి. సంస్కృతి ప్రజాజీవితానికి సంబంధించింది కాబట్టి సాంఘికచరిత్రే సాంస్కృతిక చరిత్ర.

సాంస్కృతిక చరిత్ర - సాధన సామాగ్రి:

దేశచరిత్ర వ్రాయడానికి పనికివచ్చే సాధనసామాగ్రి అంతా సాంస్కృతిక చరిత్ర వ్రాయడానికి పనికివస్తుంది కాని, పరిశీలనావిధానంలోను, దృక్పథంలోను దేశచరిత్రకారుడికి, సాంస్కృతికచరిత్రకారుడికి భేదం ఉంటుంది. ఉదాహరణకు, శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదను తీసుకోవచ్చు. అందులో రాయల దిగ్విజయవర్ణన దేశచరిత్రకారుడికి అక్కరకు వస్తే, ఆ రాజకవి విష్ణుచిత్తుని జీవిత వర్ణనలోను, ఇతర వర్ణనలలోను వ్యక్తంచేసిన ప్రజాజీవితం సాంస్కృతిక చరిత్ర