పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/53

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162. ప్రజాసమస్యలకు సత్వరమే ప్రతిస్పందించి సమర్థవంతంగా పరిష్కరించడం కోసం డయల్ 100 కమాండ్ కంట్రోల్ సెంటర్ నెలకొల్పడం జరిగింది. కేంద్రం ప్రారంభించి ఇప్పటిదాకా 2.14 మిలియన్ కాల్స్‌ను స్వీకరించడం జరిగింది. వాటి పరిష్కారానికి సంబంధించిన సంతృప్తి 95 శాతం నమోదయ్యింది. ప్రజా సమస్యలను సన్నిహితంగా వినడం కోసం పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ సెంటర్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది.

163. విభజన తర్వాత రాష్ట్రంలో రూ. 683 కోట్ల అంచనా వ్యయంతో అత్యున్నత స్థాయి గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కోసం, రూ. 412 కోట్ల అంచనా వ్యయంతో కర్నూలులో గ్రేహౌండ్స్ హబ్ ఏర్పాటు కోసం మరియు 6 ఏపిఎస్పి బెటాలియన్ల కోసం కేంద్రప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపడం జరిగింది.

164. ఇందుకుగాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ.3,739 కోట్లు ప్రతిపాదించడమైనది.

రెవిన్యూ

165. భూములకు సంబంధించిన రికార్డులను నిర్దిష్టంగానూ, సక్రమంగానూ నిర్వహించడం ద్వారా రెవిన్యూ శాఖ ప్రజలకూ, ముఖ్యంగా రైతులకు అమూల్యమైన సేవలు అందిస్తున్నది. ఇటీవలనే ఈ శాఖ భూమి రికార్డుల ను కంప్యూటరీకరించి 'మీ-సేవ' కేంద్రాల ద్వారా 68 రకాల సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. రెవిన్యూ మరియు రిజిస్ట్రేషన్ రికార్డుల ను కూడా అనుసంధానపరచడానికి చర్యలు మొదలుపెట్టింది. అంతేకాక ఈ-పట్టాదార్ పాస్ పుస్తకాలను కూడా ఇవ్వడం మొదలుపెట్టింది. ప్రభుత్వ భూములను గుర్తించి వాటి సవివరమైన జాబితాలు

51