పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/24

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గృహనిర్మాణం

57. ఆంధ్రప్రదేశ్ ను గుడిసెలుగానీ, మురికివాడలుకానీ లేని రాష్ట్రంగా రూపొందించడానికి గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని పేదలకు పక్కాఇళ్ల నిర్మాణం చేపట్టడం గృహనిర్మాణ లక్ష్యం. ఇంతవరకు 65.35 లక్షల గృహాలు పూర్తికాబడ్డాయి. 4.93 లక్షల ఇళ్ల నిర్మాణం వివిధ స్థాయిల్లో ఉంది. 6.98 లక్షల ఇళ్ల నిర్మాణం ఇంకా ప్రారంభం కావలసి ఉంది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో భారతప్రభుత్వం వారి ఆర్ ఎవై పథకం ద్వారా ప్రస్తుత సంవత్సరంలో 25,000 ఇళ్లు నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయించింది.

58. ప్రస్తుత ప్రభుత్వం ఎస్.సి./ఎస్.టి. నిరుపేదలకు ఇంటికి రూ.1.50 లక్షల వ్యయంతోనూ, ఇతర బలహీన వర్గాలవారికి లక్ష రూపాయలతోనూ ఇళ్లు నిర్మించాలని సంకల్పించింది. ఇందుకుగాను నిర్మాణ వ్యయం వృథా కాకుండా ప్రస్తుతం నడుస్తున్న పథకాన్ని సవరించనున్నాము.

59. ఇందుకుగాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ. 808 కోట్లు ప్రతిపాదించడమైనది.

పౌర సరఫరాలు

60. దారిద్ర్యరేఖకు దిగువనున్న కుటుంబాలకు పౌష్టికాహారం అందుబాటులోకి తీసుకురావడం కోసం గతంలో మా ప్రభుత్వం రూపకల్పన చేసి అమలులోకి తీసుకొచ్చిన సబ్సిడీ బియ్యం పథకాన్ని కొనసాగించడంతో పాటు, తగిన ధరలకు వివిధ ఆహారవస్తువుల్ని అందించే కార్యక్రమం కూడా చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయించింది.

22