పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf/8

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

డాక్టర్ వై.యస్.ఆర్. రైతు భరోసా కేంద్రాలు

15. ప్రభుత్వం 10,544 గ్రామీణ మరియు 234 పట్టణ డాక్టర్ వై.యస్.ఆర్. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇవి సమీకృత వ్యవసాయ పెట్టుబడి (ఇన్-పుట్) కేంద్రాలు మరియు రైతు విజ్ఞాన కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. డాక్టర్ వై.యస్.ఆర్. రైతు భరోసా కేంద్రాలను వ్యవసాయ మరియు ఉద్యాన వన పంట ఉత్పత్తుల సేకరణ కేంద్రాలుగా కూడా మన ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం, 2020-ఖరీఫ్ సమయంలో రైతు భరోసా కేంద్రాల స్థాయిలో 4000 సేకరణ కేంద్రాలు ప్రారంభించబడ్డాయి. రైతుల రవాణా ఖర్చును ఆదా చేస్తూ గ్రామ స్థాయిలోనే కనీస మద్దతు ధరను నిర్ణయిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని నేను గౌరవ సభకు తెలియజేస్తున్నాను.

16. మన ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి, రూ.5,806 కోట్ల విలువైన 16.46 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ వస్తువులను సేకరించడం జరిగింది. ఇందులో లాక్ డౌన్ వ్యవధిలోనే 2,582 కోట్ల విలువైన సేకరణ జరిగింది. ఈ సేకరణ రైతులకు సకాలంలో సహాయాన్ని అందించేందుకు మరియు రైతుల సంక్షేమానికి మన ప్రభుత్వ నిబద్ధతకు ఉదాహరణ అని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. మన ప్రభుత్వం వ్యవసాయ మరియు ఉద్యానవన ఉత్పత్తులలో మార్కెట్ జోక్యం కోసం 3,000 కోట్ల రూపాయలతో 'ధరల స్థిరీకరణ నిధిని’ ఏర్పాటు చేసింది. 2021-22 సంవత్సరానికి ధరల స్థిరీకరణ నిధి భర్తీ కోసమై రూ. 500 కోట్లు ప్రతిపాదిస్తున్నాను.


డాక్టర్ వై.యస్.ఆర్. వ్యవసాయ టెస్టింగ్ ల్యాబ్స్

17. రైతుల పరిసర ప్రాంతాలలో నాణ్యమైన పరీక్షా సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం నియోజకవర్గ స్థాయిలో 147 ప్రయోగశాలలు, జిల్లా స్థాయిలో 11 ప్రయోగశాలలు, 4 ప్రాంతీయ కోడింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ సమీకృత ప్రయోగశాలలు నాణ్యమైన పెట్టుబడి (ఇన్-పుట్ ల) లభ్యతను నిర్ధారిస్తాయి మరియు తద్వారా పంట

8