పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf/5

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9. ఒకవైపు ప్రజల ప్రాణాలను కాపాడటం, మరొకవైపు ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పకుండా నైపుణ్యంగా సమతుల్యం చేయడం అనేవి మన ప్రభుత్వానికి పరీక్షా సమయాలుగా నిలిచాయి. కోవిడ్-19 మహమ్మారిపై పోరాడటానికి, 'గుర్తింపు-పరీక్ష-చికిత్స' (ట్రేస్, టెస్ట్ మరియు ట్రీట్) విధానాన్ని బాధ్యతగా తీసుకొని, మన ప్రభుత్వం చిత్త శుద్ధితో అమలుచేస్తున్నది. కరోనా వైరస్ యొక్క వ్యాప్తిని నిరోధించటానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ట్రేస్, టెస్ట్ మరియు ట్రీట్ విధానంపై బ్రిటీష్ హైకమీషన్ ప్రశంసలు కురిపించింది. ఈ కార్యక్రమములో వైద్య, పురపాలక మరియు పంచాయతీ రాజ్ విభాగాల నుండి పెద్ద సంఖ్యలో ముందువరుసలో ఉండే ఆరోగ్య సంరక్షణ నిపుణులు, వైద్యులు, ప్రజారోగ్యం మరియు పారిశుద్ధ్య సిబ్బంది, రెవెన్యూ మరియు పోలీసు విభాగాల సిబ్బందితో పాటు గ్రామ మరియు వార్డు వాలంటీర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొనడం అపూర్వమైన విషయం. గత ఆర్ధిక సంవత్సరం మనమంతా కోవిడ్-19 మహమ్మారితో పోరాడుతున్నప్పుడు మాత్రమే కాకుండా, అన్ని సంక్షేమ విధానాలను సజావుగా అమలు చేసేటప్పుడు కూడా గ్రామ మరియు వార్డు సచివాలయ వ్యవస్థల యొక్క ఉపయోగం తెరపైకి వచ్చింది.

10. సంక్షేమ పథకాల ఫలాలు అందరికీ అందివ్వడంలో ఎవ్వరూ వదిలివేయబడ కూడదనే మార్గదర్శక సూత్రంతో, కోవిడ్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించవలసిన ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని,రాష్ట్రాన్ని సామాన్య స్థితికి మరియు స్థిరమైన వృద్ధి మార్గంలోకి మార్చడానికి అవసరమైన, ధైర్యంతో కూడుకున్న పురోగామి చర్యలను తీసుకోవాలని మా నాయకుడు నిశ్చయించుకున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా మన ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, కీలకమైన అభివృద్ధి కార్యక్రమాలైన - నవరత్నాలు మరియు మ్యానిఫెస్టో లోని ఇతర వాగ్దానాల ద్వారా, 2030 నాటికి అన్ని సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (S.D.G.) సాధించే దిశగా సమగ్ర విధానాన్ని అనుసరిస్తోంది.

5