పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf/20

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వై.యస్.ఆర్. సున్నా వడ్డీ

38. మన ప్రభుత్వం 2020 ఏప్రిల్ 24న వై.యస్.ఆర్. సున్నా వడ్డీ పథకమును ప్రారంభించింది. ఈ పథకం అమలులో భాగంగా 2019-20 సం॥నకు చెందిన రుణాలపై వడ్డీకి సంబంధించి రూ.1400 కోట్లను బదిలీ చేయడం జరిగింది. తద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని 8 లక్షల 78 వేల 874 స్వయం సహాయక సంఘాలకు చెందిన 90 లక్షల 37 వేల 254 మంది మహిళలు లబ్ధి పొందారు. ఏప్రిల్ 2021 లో ఈ పథకానికి 1,112 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. 2021-22 సంవత్సరంలో 1,112 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

వై.యస్.ఆర్. చేయూత

“మహిళలను అభివృద్ధి చేయవలసిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే అభివృద్ధి కే మహిళల సహకారం అవసరం” అన్నారు - ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రెటరీ జనరల్ కోఫీ అన్నన్ గారు.

ఆర్థిక స్వాతంత్ర్యం, అధికారం పొందిన మహిళలు, వారి కుటుంబాలు, సమాజం మరియు జాతీయ, ఆర్థిక వ్యవస్థలకు ఎక్కువ సహకరిస్తారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2030ని సాధించటానికి మహిళా సాధికారత తోడ్పడుతుంది.

39. 2020 ఆగస్టు 12న, వై.యస్.ఆర్. చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా మన ప్రభుత్వం తన మరో వాగ్దానాన్ని నెరవేర్చడం జరిగింది. సామాజిక, ఆర్థిక సాధికారత వైపు నడిపించడానికి 45-60 సంవత్సరాల మధ్య వయస్సు గల షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల, వెనుకబడిన తరగతుల మరియు అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన 23 లక్షల 76 వేల మంది మహిళా లబ్దిదారులకు 4,455 కోట్ల రూపాయలు సహాయాన్ని అందించాము. రెండవ విడత ఆర్థిక సహాయం కూడా త్వరలో విడుదల చేయడానికి ప్రతిపాదిస్తున్నాను. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల మహిళలకు కూడా ఇదే విధమైన ఆర్థిక సహాయాన్ని అందించుటకు ప్రభుత్వం నిర్ణయించింది.

20