పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20.pdf/24

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెనుకబడిన తరగతుల సంక్షేమం

62. ఈ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సమగ్ర అభివృద్ధిని సాధించేందుకు కట్టుబడి ఉంది. ఇందుకొరకు, మేనిఫెస్టోలో వాగ్దానం చేసినట్లుగా ప్రభుత్వం బిసిల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన కార్యకలాపాల నిమిత్తం రూ.15,061 కోట్ల మొత్తాన్ని కేటాయించింది. బిసి కమీషన్ ను మరింత సమర్థవంతంగా రూపొందించేందుకు పునర్ నిర్మించాలని కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

63. ఈ ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.10,000 మేరకు నాయీ బ్రాహ్మణులు మరియు రజకులకు ఆదాయ మద్దతును ప్రవేశపెట్టాలని ప్రతిపాదిస్తున్నది. ఇది వారి యంత్రాలను ఆధునీకరించుకుని, అధిక ఆదాయాలను ఆర్జించేందుకు దోహదపడుతుంది. ఈ చర్య రూ.200 కోట్ల వ్యయంతో సుమారు 23,000 మంది నాయీ బ్రాహ్మణులు మరియు సుమారు 1,92,000 మంది రజకులకు ప్రయోజనం చేకూర్చుతుందని ఆశించడమయింది. ఈ ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.100 కోట్ల కేటాయింపుతో దర్జీలకు రూ.10,000/-ల ఆదాయ మద్దతును ప్రవేశపెట్టాలని కూడా ప్రతిపాదిస్తున్నది.

64. అదేవిధంగా, ప్రతి చేనేతకారుని కుటుంబానికి రూ. 24,000/-ల ను సమకూర్చేందుకు కూడా మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇది, వారి పరికరాలను ఆధునీకరించుకొని మర మగ్గాల ఉత్పత్తులతో పోటీపడేందుకు ఉపకరిస్తుంది. చేనేతకారులు గౌరవప్రదమైన ఆదాయాలను ఆర్జించడానికి అవసరమైన మార్కెటింగ్ సహాయాన్ని మరియు ఇతర సబ్సిడీలను కూడా మేము అందించడం జరుగుతుంది.

65. మేనిఫెస్టోలో వాగ్దానం చేసినట్లుగా, వెనుకబడిన తరగతుల కోసం ప్రభుత్వం 139 ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తుంది. ఈ కార్పొరేషన్లు వివిధ బిసి ఉప-సామాజిక వర్గాలకు చెందిన ప్రజల అభివృద్ధికి సహాయం అందిస్తాయి. పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని ప్రవేశపెట్టడానికి ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్లను పునరుద్ధరిస్తాము. సవివరంగా లెక్కించిన తరువాత, వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ఈ కార్పొరేషన్ల ద్వారా వచ్చే సంవత్సరం నుండి ప్రారంభిస్తాం.

24