పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగము 2019-20.pdf/5

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కల్పించటం, అత్యున్నత విద్య, మెరుగైన ఆరోగ్యం మరియు పోషకాహారాన్ని అందించటం, కార్మిక వర్గాన్ని భాగస్వామ్యం చేయటం మరియు ఇంటా బయటా భద్రత కల్పించటం తదితర చర్యలను విస్తృతపరిచేందుకు మా ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తోంది.

11. గౌరవ ముఖ్యమంత్రిగారు సదా మహిళా సాధికారత కోసం బలంగా వాదించేవారు. రెండు దశాబ్దాల క్రితం ఆయన ప్రారంభించిన 'వెలుగు' పథకం అన్ని వర్గాలతో కూడిన 94 లక్షల మంది స్వయం సహాయక సంఘ సభ్యులకు విస్తరించి ప్రపంచంలోనే అతి పెద్ద పేదరిక నిర్మూలన కార్యక్రమంగా నిరూపితమైనది. ఈ పథకం ద్వారా లబ్ధిపొందినవారిలో 17 లక్షల మంది షెడ్యూల్డు కులాలవారు, 5 లక్షల మంది షెడ్యూల్డు తెగలవారు, 46 లక్షల మంది వెనుబడిన తరగతులవారు, 5 లక్షల మంది మైనారిటీవారు, 21 లక్షల మంది జనరల్ కేటగిరివారు ఉన్నారు.

12. 2014 సంవత్సరంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి స్వయం సహాయక సంఘాలపై విపరీతమైన ఆర్థిక వత్తిడి ఉంది. మహిళాసాధికారత లేనిదే సమాజ వికాసం మరియు కుటుంబ వికాసం సాధించలేమన్న గట్టి నమ్మకంతో, ఆర్ధిక ఒత్తిళ్ళకు కూడా నెరవకుండా 'పసుపు కుంకుమ” పథకాన్ని మా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రతి స్వయం సహాయక సంఘ సభ్యురాలికి రూ.10,000 చొప్పున ఆర్ధిక సహాయం ఈ పథకం ద్వారా అందచేయడమైంది. రూ.8,604 కోట్ల మేర 86,04,304 స్వయం సహాయక సంఘ సభ్యులకు దీనిద్వారా లబ్దిచేకూరింది.

13. డ్వాక్రా మరియు మెప్మా ఆడపడుచుల అందరి బాధ్యత భుజాన ఎత్తుకున్న "అన్న"గా, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతకు నడుం కట్టారు. గతంలో ఇచ్చిన దానికి అదనంగా మరోమారు 10,000 రూపాయలు ఇవ్వాలని, 2019 ఫిబ్రవరిలో 2500 రూపాయలు, మార్చిలో 3500 రూపాయలు మరియు ఏప్రిల్లో 4000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. దీని ద్వారా రాష్ట్రంలోని 93.81 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు 9,381 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుతుంది.

14. మా ప్రభుత్వం బ్యాంక్ అనుసంధాన విధానాన్ని 63,283 కోట్ల రూపాయలతో 20,50,794 స్వయం సహాయ సంఘాలకు విస్తరించేసింది. స్త్రీ నిధి ద్వారా లబ్దిదారుల సంఖ్యను రెట్టింపు చేస్తూ 16.77 లక్షల మందికి 4,313 కోట్ల రూపాయల వ్యయంతో 2014-15 నాటికంటే 5 రెట్ల ఋణాలను అందించటం జరిగింది. వడ్డీలేని ఋణాల నిమిత్తం 2,514 కోట్ల రూపాయలు 8.5 లక్షల స్వయం సహాయక సంఘాలకు చెల్లించడం జరిగింది.

15. ప్రామాణిక ఉద్యోగులతో పాటుగా ఒప్పంద ఉద్యోగులు, పొరుగు సేవల ఉద్యోగులకు కూడా 180 రోజుల ప్రసూతి సెలవు వసతిని మా ప్రభుత్వం కల్పించింది. మహిళలు ప్రభుత్వ ఉద్యోగాలలో మరింతగా పాలుపంచుకొనే దిశగా ఈ చర్య దోహదపడుతుంది.

4