పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగము 2019-20.pdf/30

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

149. సమాజంలో ప్రస్తుతం ఎదురయ్యే సవాళ్ళను పరిశీలిస్తే ఆర్థిక అసమానతలు, యాంత్రికత మరియు నిరుద్యోగత, వాతావరణ అనూహ్య మార్పులు, వృద్ధత్వం వంటివి ఎదుర్కొంటున్నాము. ఈ సవాళ్ళన్నింటినీ సమర్థంగా ఎదుర్కోగల, ఆర్థిక అసమానతలను తొలగించే సంక్షేమ పథకాలను అన్వేషించగల పరిపాలన వైపు సాగాల్సిన తరుణం ఇది. పింఛన్లు, రేషన్ కార్డులు, పక్కా ఇళ్ళ నిర్మాణం, ఉపకార వేతనాలు, బీమా, నిరుద్యోగ భృతి మొదలైన వాటిలో సంతృప్త స్థాయికి చేరడమే ఈ దిశగా మన ప్రయత్నం.

150. కియా మోటార్స్ వంటి అంతర్జాతీయ కంపెనీలు ఆకర్షించటం ద్వారా నాణ్యమైన ఉపాధి అవకాశాలను కల్పించే వాతావరణం రాష్ట్రంలో నెలకొల్పాం. ఫిన్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, బిగ్ డేటా తదితర కొత్తతరం సాంకేతికతలున్న సంస్థలపై పెట్టుబడులను రాబట్టి రాష్ట్రాన్ని, దాంతోపాటు మన యువతరాన్ని ప్రపంచంలోనే అత్యున్నత శక్తి వనరుగా రూపొందిస్తున్నాం. ఉద్యోగ భద్రత మరియు స్థానికుల ఉద్యోగాల కోసం మన పారిశ్రామిక విధానాలను మరింత మెరుగు పరుస్తున్నాము.

151. వాతావరణ మార్పుల విషయానికి వచ్చేసరికి “కరువు రహిత వ్యవసాయం” పెద్ద ఎత్తున విస్తృతం చేయటం, దానిని కొనసాగించటంలో మేము విజయం సాధించాం. సుస్థిరమైన మరియు పర్యావరణ హితమైన వృద్ధి సాధనలో “మనం పెట్టుబడి రహిత సహజ సేద్యంలో (ZBNF) అగ్రగ్రామీగా ఉన్నాం. ప్రకృతి విపత్తులనుండి రాష్ట్రాన్ని కాపాడటంలో పోలవరం డ్యామ్ దోహదపడుతుంది. పర్యావరణం మరియు ప్రజారోగ్య పరిరక్షణకు దోహదపడే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో మనమే ముందున్నాము. దీనితో పాటు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పచ్చదనాన్ని పెంచుతున్నాము.

152. రాష్ట్ర సంపద ఎప్పటికప్పుడు పెంపొందాలంటే యువతరం జనాభా అత్యధికంగా ఉండాలి. రాష్ట్ర పునరుత్పత్తి రేటు తక్కువగా ఉండటంపై మన గౌరవ ముఖ్యమంత్రిగారు అనేకమార్లు ఆందోళన చెందడాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. పునరుత్పాదక రేటు తగ్గితే అది ఆర్థిక పరిస్థితిపై విషమ ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ సవాలును అధిగమించాల్సిన అవసరం ఉంది.

153. అధ్యక్షా! గౌరవ ముఖ్యమంత్రిగారు, నా సహచరులు మరియు నేను మా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్న సమస్యలను పరిష్కరించడమే కాకుండా, భావితరాల భవిష్యత్తు కోసం కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మన రాష్ట్ర పునర్ నిర్మాణంలో, యావత్ ప్రజానీకం వెన్నుదన్నుగా ఉన్నారని మరువకూడదు. మన కఠోర శ్రమ, మన ఉద్యోగుల చిత్తశుద్ది, అంకిత భావం వల్లే ఇంత అభివృద్ధి సాధ్యమైంది. అందుకే, మనం సాధించిన ఈ ఘనవిజయాలు అన్నింటినీ మన ప్రజలకే అంకితం చేస్తున్నాము.

154. మన రాష్ట్రం ఆశించిన గమ్యం చేరేందుకు మనందరిలో నైతిక సామర్థ్యాన్ని పెంచిన సమర్థ నాయకత్వంపై రాష్ట్ర ప్రజానీకం యావత్తూ అచంచల విశ్వాసాన్ని ప్రదర్శిస్తుందని ఆశిస్తున్నాను.

29