పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/86

ఈ పుట ఆమోదించబడ్డది


గీ.

పల్లకుల నందలంబుల భద్రకరుల
గుఱ్ఱముల వీని లెస్సఁగా గుఱుతు లెఱిఁగి
యెఱిఁగినటువంటివారు దే నెక్కవలయు
నాత్మరక్షణ మొందుట కవనివిభుఁడు.

115


క.

దొర మిక్కిలి యిరుకట మగు
తెరవున నెవ రెఱుఁగకుండుతెరవున నెచ్చో
నరుగుట కొఱగా దందురు
ధరలోపల నీతిశాస్త్రతత్పరు లెల్లన్.

116


క.

కనుగొనినపనుల నితవరి
తనమున బ్రాతఱికమునను దగువారల నెం
దును మంచివారిఁ దెలియుచు
జనపతి యేర్పఱచి యునుపఁజనుఁ దనచెంతన్.

117


గీ.

ధార్మికులు గానివారలఁ దా నెఱుంగు
దోసకారుల నవమానితులను బరుల
వలన వచ్చినవారిఁ గ్రూరుల నెఱింగి
దూరమునఁ బాయవలయును దొరల కెల్ల.

118


గీ.

ఆరులయోడలఁ జెదరఁగ నడ్డపెట్టఁ
బడెడునోడ బరీక్షింపఁబడనిపీలి
కాండ్రు గలయోడ పెనుగాలిఁ గదలునోడ
బ్రాఁతయోడయు నెక్కఁగాఁ బతికిఁ దగదు.

119


చ.

నరపతి వెట్టబెట్టగు దినంబులఁ గ్రీడలు సల్పఁ బొల్పగున్
సరసులఁ బెద్దమీలను మొసళ్ళను వీడఁగఁ జేసి యాప్తతం
బరగిన సైన్యముల్ దనుఁగనన్ దగనుండ నొనర్చి కాచునా
దరములతో హితుల్ సతులు దాను వినోదము మోద మందఁగన్.

120