పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/83

ఈ పుట ఆమోదించబడ్డది


క.

మదయుతులు నిరంకుశులై
కొద వెడలినరాజతనయకుంజరముల నెం
దదయు లయి పరిభవించినఁ
జదుపరె తోఁబుట్టునైన జనకుని నైనన్.

89


క.

ఏకడల మత్తులై డగు
రాకొమరులు నెఱుపుచుండురాజ్యముఁ బ్రోవన్
జేకుఱుట దుర్లభం బగుఁ
గైకొని పులివాతఁ బడినకండ యనంగన్.

90


క.

తముఁ బ్రోచువారినై నను
దమకముతోఁ గొదువ గలుగుతఱిఁ జెఱుతురు రా
కొమరులు భువిలోపల సిం
హముకొదమలలీలఁ జాల నాలకు లగుచున్.

91


క.

వినయము గలుగుచు మెలఁగఁగఁ
దనయుల శిక్షింపవలయు ధరణీపతికిన్
వినయులు గాకుండినతన
తనయులచేఁ గులము బలము దలముం జెడదే.

92


క.

వినయము గలుగుకులస్త్రీ
తనయుని యువరాజు సేయఁ దగు నెయ్యెడలన్
వినయము లేనికుమారునిఁ
బనుపడ మదగజములీల బంధింపఁదగున్.

93


ఆ.

ఓజగేడనైన రాజపుత్రుని వెళ్ళఁ
దోలఁ దగదు వెళ్ళఁ దోలెనేని
యతఁడు గడుఁ బ్రయాస మంది శత్రువు లైన
జనులఁ గూడి యతనిఁ జదుపుఁ గాన.

94


క.

వెసఁ దండ్రి చెప్పనట్టులె
కసరక వర్తించునటులఁగా నెల్లపుడున్
వ్యసనాశ్రయజనములచే
వ్యసనము గలసుతుల వెతల నందించఁదగున్.

95

ఆత్మరక్షితప్రకరణము

క.

ఇల ఱేఁడు మోసపోవక
తెలివిన్ విష మిడకయుండఁ దెలియందగుఁ బీ
టల వలువలఁ దొడవుల శ
య్యల భోజనపానవాహనాదులయందున్.

96


క.

విషహర మగుమణు లిడికొని
విషహక మగుజలక మాడి విభుఁ డొందఁదగున్
విషరహితభోజనంబుల
విషహరు లగువెజ్జు లుండ వేడుకతోడన్.

97

విషపరీక్షావిధానము

క.

ఇలలోఁ గోఁతులు గొరవం
కలు రాచిలుకలును విసము గనుకొనినం బా
ముల గనుగొనిను గడుఁ గూ
తలు బెట్టు నటండ్రు నీతితత్త్వవిధిజ్ఞుల్.

98


సీ.

విషముఁ జూచినవేళ విషయుక్త మైనప
             దార్థంబుఁ జూచిన యట్టివేళఁ
దలకబాఱుచును గోఁతులును రాచిలుకలు
             గోరువంకలు సారెెెఁ గూఁత లిడును
కన్ను లెఱ్ఱఁగ బాఱుఁ గలహంసలకు నెల్ల
              మఱి ముదంబును జెంది మలయుఁ గొంచ
మదకోకిలంబులు మరణంబుఁ జెందును
              వెన్నెలపులుగులు వేగ బడలు


గీ.

నిందు నొక్కటిదేనైన నెందు లెస్సఁ
దాఁ బరీక్షించి ధారుణీధవున కెపుడు
భోజనముఁ జేయఁదగు నిట్లు భోజనంబుఁ
జేయుచుండినఁ బతి హానిఁ జెందకుండు.

99


క.

నెమిలియు దుప్పియుఁ బాముల
నమలుం గావున విభుండు నగరులలోఁ దా
నెమిలిని దుప్పిని సతతముఁ
దమితోడుతఁ బెంచి విడువఁదగు లీల నిలన్.

100


క.

జగతీపతి భుజియింపఁగఁ
దగు నన్నము మున్ను వహ్నిఁ దా నిడి విషముల్
దగ నెఱిఁగినపక్షుల కిడి
తగులీలఁ బరీక్షఁ జేసి తగు భుజియింపన్.

101


గీ.

ఎందు విషముండు నన్నంబు లిడినయపుడు
నల్లనంగుమంటచే నగ్ని నల్ల నగును
బొదలి చిటచిట మనెడి చప్పుడును బొడముఁ
బులుఁగులకు నెల్ల మరణంబు గలుగుచుండు.

102


క.

వలువల నందుట పెఱచా
యలఁ జెందుట యెండియుండు టార్ద్రం బగుటన్
నలుపైన యావి గలుగుట
తలఁప విషాన్నంబునకును దగుచిహ్నంబుల్.

103


క.

ఉడుకుతఱి నల్లనురుగులు
పొడముట తావియు రసంబుఁ బోవుట స్పర్శం
బుడుగుట యెండుటయును విష
మిడఁబడుకూరలకు గుఱుతు లివి యెఱుఁగఁదగున్.

104