పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/81

ఈ పుట ఆమోదించబడ్డది


క.

ధర్మార్థం బగుహింసలు
ధార్మికులై మునులఁ బోలి తగురాజులు ము
న్నిర్మలులై యొనరిచి రిది
ధర్మము గావున వధింపఁదగు పాపాత్మున్.

78


క.

జనపతి ధర్మముఁ దప్పక
ధన మార్జింపంగవలయు ధర్మముకొఱకై
జనులను బీడింపుదు రే
జను లనిశము వారిచేఁత శాసింపఁదగున్.

79


క.

ఎట్టిది మెత్తురు సజ్జను
లట్టిదెపో ధర్మ మనఁగ నలరుం ధరలో
నెట్టిది మెచ్చరు సజ్జను
లట్టిదియ యధర్మ మనఁగ నలరుచునుండున్.

80


క.

జనపతి సుజనుల మర్యా
దనె మెలఁగుచు వినయమునను ధర్మ మధర్మం
బును దెలియుచుఁ దా భూప్రజ
లను బ్రోవఁగఁ దగును దూష్యులం దునుమఁదగున్.

81


వ.

అవ్విధం బెట్టిదంటేని.

82


గీ.

అధిపు చనవరులగుచు రాజ్యంబుఁ జెఱుచు
పాపకర్ముల మూఁకలై పరగువారి
నొక్కఁడొక్కఁడుగా నేని నుండువారి
దూష్యులని పల్కుదురు నయధుర్యు లెందు.

83


వ.

అట్టి దూష్యజనంబులం జనంబు లెవ్వరు నెఱుంగకుండ ధనంబు
చేతనైనను గైదువులచేతనైన నుపాంశుదండప్రకారంబున
దండింపవలయు నొండె, లోకశత్రువులని సకలజనంబులచేత
నిందనొందించి ప్రకాశదండంబుచేతనైనను జంపవలయు నందు
నుపాంశుదండప్రకారంబు.

84