పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/80

ఈ పుట ఆమోదించబడ్డది


ఉ.

ఎట్టి యుపాయమార్గముల నిమ్మహిలోన జనంబు చిత్తముల్
గట్టిగఁ గానుపించు వెలిఁ గన్పడువస్తుసమూహ మట్ల తా
నట్టి యుపాయమార్గముల నందఱిచిత్తము లెంచి చూచుచున్
నెట్టన యోగిరీతి ధరణీభవుఁడుం జెలువొందఁగాఁ దగున్.

72


మ.

తనచారిత్రముచేత నెట్టియెడ మోదం బందుచు న్మించుభూ
జనులుం బంట్లును గల్గి దుర్ణయగతిం జాలింపుచుం దేనియల్
సిలుకం బల్కుచునుండు భూమిపతి దా శీలంబు నేర్పొందు నా
ప్తునిపై నెంతయు రాజ్యభార మిడినన్ బొల్పొందుఁ దేజస్వియై.

73

కంటకశిక్షణప్రకరణము

ఉ.

సంతత మాదరంబునఁ బొసంగుచు లోకమునందు వేదమం
దెంతయు నేర్పుతో మెలఁగి యెయ్యెడ నేర్పరు లైనసజ్జనుల్
సంతసమంది కొల్వఁ దనసద్గుణముల్ గనుపట్టుచుండ బా
హ్యాంతరరాజ్యచింత వసుధాధిపవర్యుఁడు సేయఁగాఁ దగున్.

74


గీ.

దేహ మాంతరరాజ్యంబుఁ దెలిసి చూడ
బాహ్యరాజ్యంబు రాష్ట్రమై పరగు నొకటి
కొకటి కాధారమై రెండు నుండుఁ గాన
యిట్టి రెండును నయవిదు లేక మండ్రు.

75


క.

బలు వగురాజ్యాంగంబులు
గలుగుట రాష్ట్రంబువలనఁ గనుక ధరిత్రీ
తలనాథుఁడు యత్నముతో
నలువుగ రాష్ట్రంబుపాలనము సేయఁదగున్.

76


క.

జనముల రక్షించుటయే
జనపతికిన్ ధర్మ మట్టిసద్ధర్మము ని
ల్పును జనపతితను వటుగనఁ
దనతను వనిశంబు బ్రోవఁదగు నాయమునన్.

77