పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/8

ఈ పుట ఆమోదించబడ్డది

విద్వాంసులు ఈ కామందకమునుఁ దెనుఁగుటీకతోఁ దెనుఁగులిపిలో ముద్రించిరి. తిరువాన్కూరు ముద్రణమునకును దీనికిని గొన్ని భేదము లున్నవి. కృష్ణారావుగారి తెలుఁగుటీక ప్రశస్తమైనది. వా రీపద్యకామందకము నెఱుఁగరు.

ఆంధ్రకామందకము - రాజనీతిగ్రంథములు

ఈ కామందకమును క్రీ. శ. 1400 పూర్వకాలముననే యెవ్వరో పద్యకావ్యముగాఁ దెనిఁగించిరి. అందలి పద్యములు పెక్కులు మడికి సింగన సకలనీతిసమ్మతమున నుదాహృతము లై యున్నవి. సకలనీతిసమ్మతమున మడికిసింగన యీ క్రిందివాని నాంధ్రరాజనీతిగ్రంథములను బేర్కొనినాఁడు. అవి ముద్రామాత్య పంచతంత్రీ బద్దెభూపాల చాణక్య ధౌమ్యవిదుర ధృతరాష్ట్రబలభద్ర కామందక గజాంకుశ నీతిసార నీతిభూషణ క్షేమేంద్ర భోజరాజవిభూషణ పురుషార్థసార భారత రామాయణాది మహాకావ్యంబులు పురాణేతిహాసంబులు కందనామాత్యు నీతితారావళి లోకోక్తి చాటుప్రబంధంబులును. వీనిలోఁ బెక్కుగ్రంథములు నష్టము లైనవి. సింగన ఆయాగ్రంథములలోని పద్యములను బెక్కింటిని తనగ్రంథమున నుదాహరించికొనినాఁడు. అందు బద్దెననీతి యొకటి మాత్రమే యిపుడు లభించుచున్నది. సకలనీతిసమ్మతమును బోలె శ్రీరామకృష్ణకవిగారే తొలుత నీబద్దెననీతిం బ్రకటించిరి. సకలనీతిసమ్మతమున నుదాహరింపఁబడిన ప్రాచీన కామందకపద్యములు కొన్ని యిచటఁ జూపుచున్నాఁడను.

ఉ.

స్నానవిలేపనాభరణచారుసముజ్జ్వలగాత్రుఁడై శుభ
స్నానము నాత్మదత్తవసనస్ఫుటమూర్తియు నైనదేవులన్
స్థానము సేర్చి వారి సదనంబుల కేఁగక చేయుదు న్నిజా
ధీనమనస్కుఁడై సతులతీపులు నమ్మకయున్కి యొప్పగున్.

(సకలనీతిసమ్మతము. పద్యము 288; ఆంధ్రకామందకము; అ. 3. ప. 136.)