పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/79

ఈ పుట ఆమోదించబడ్డది


క.

జనపతియం దల్పంబై
దనరిన యపకారమైనఁ దాఁ జేయఁగడం
గిన జడుఁడున్ జెడును జితిం
గనుఁగొని పడి మిడుత మడియుకరణిన్ ధరణిన్.

66


ఉ.

భూవలయంబునన్ విభుఁడు పోషణ మెందు నొనర్ప లెస్సగా
నావులు పాలు పిండుగతి నన్నిటఁ బ్రోది చెలంగఁ జేసినన్
దీవలు పూవు లిచ్చుగతి ధీరతఁ జేకొని ప్రోచెనేని తాఁ
గావలె నన్నయర్దములు గన్పడ నిత్తురు వేడ్కతోఁ బ్రజల్.

67


శా.

భండారం బొనఁగూర్పఁగా వలయు భూపాలుండు యత్నంబుచే
నిండార న్మదియందు నాప్తుఁ జతురున్ నిల్పందగున్ గీర్తి బ్ర
హ్మాండంబంతయు మీఱనీవదెఁ ద్రివర్గాపేక్షతో వేళలన్
దండారం జితలోకుఁడై మిగుల నుద్దండప్రతాపోన్నతిన్.

68


మ.

తనకుం గల్గినకల్మియంతయును దా ధర్మార్థమై వెచ్చ పె
ట్టిన భూపాలునిలేమియున్ మిగులఁగా ఠీవుల్ ఘటించుం ధరి
త్రిని జేజేలకునై కళల్వరుసతో దీపించఁగా నిచ్చు చం
ద్రునినిర్ పేదతనంబువోలె జగదారూఢప్రభావోన్నతిన్.

69


క.

ఇతరులఁ గడు నమ్మక యే
గతిఁ గార్యం బొనరు నటులఁగా నమ్మఁదగున్
క్షితిపతికిం దలఁప 'బృహ
స్పలే రవిశ్వాస' యనెడి శాస్త్రముకల్మిన్.

70


ఉ.

నమ్మఁగ రాక యుండెడుజనమ్ముల నమ్మఁగఁ బోల దెట్టిచో
నమ్మఁగ నర్హులై తగుజనమ్ములనైనను దాను మిక్కిలిన్
నమ్మఁగరాదు నమ్మిన ఘనమ్మగు సంపద వారిసొమ్మె యౌ
నిమ్మహిఁ గాన రాజులకు నెవ్వరి నమ్మఁగరాదు నెమ్మదిన్.

71