పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/77

ఈ పుట ఆమోదించబడ్డది


క.

చెలులును బ్రాజ్ఞులుఁ జుట్టం
బులు నాప్తులు గలసి మెలసి భోగింపక ని
ష్పలమై దలమై చెలఁగెడు
కలిమియుఁ దానేల యట్టి ఘనతయు నేలా.

54


క.

కలకొలఁదిఁ బంచిపెట్టుచుఁ
జెలికాఁడునుబోలె సంతసిలఁ బలుకుచు భృ
త్యులు గలుగ నడచు దొర కీ
యిల యెంత జగత్త్రయంబు నేలఁగ వచ్చున్.

55


చ.

మునుపె పరీక్ష సేసి నయముం బ్రియముం దగ నాప్తులైన స
జ్జనముల నాయపెట్టునెడ సంతతముం దగ నిల్పి వారిచే
ననువుగ రాజవర్యుఁడు ధనాదులఁ గూర్చుట యొప్పు నీరముల్
దనకిరణాళిఁ బీల్చుచు ముదంబునఁ జెందెడు భానుఁడుం బలెన్.

56


క.

తొలుత నధికారితనమున
నలవడి యావంక లెఱిఁగి యత్నము ధనముం
గలిగి శుచులైనవారల
నిలఱేఁ డాయాయి పనులయెడ నిల్పఁదగున్.

57


ఉ.

మంచితనంబువారి జనమండలి మెచ్చినవారి లంచ మా
సించనివారి యత్నములు సేయుచు నుండెడివారిఁ దాఁ బరీ
క్షించినవారి నేరుపులఁ జెందినవారి నిజంబుచేఁ గడున్
మించినవారి భూవిభుఁడు నిల్పఁదగుం బనులందుఁ బొందుగన్.

58


క.

ఏపను లెఱిఁగినవారల
కాపనులనె చెప్పి సేయుమనఁ దగుఁ బతి తా
రూపాదివిషయములకై
యేపట్టున నింద్రియముల నెసఁగించుగతిన్.

59