పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/76

ఈ పుట ఆమోదించబడ్డది


క.

కులమును బ్రాఁతఱికము వి
ద్యలును స్వభావంబు శూరతయును వయోవ
స్థలు దెలిసి యాదరింపన్
వలయుఁ బతి మహాత్ములైన వారల నెల్లన్.

48


క.

మనసరులగు సత్కులజుల
జనపతులు దిరస్కరింపఁ జన దెవ్వేళన్
ఘనముగఁ దిరస్కరించినఁ
దను నొవ్వఁగఁ జూతు రొండె తను విడుతు రిలన్.

49


క.

ఇలఁ బేదలైన వారిం
గొలఁదిగఁ గలవారి సాధుగుణయుతు లైనన్
బలియింపవలయు వారల
బలిసినఁ బతి సిరుల మిగులఁ బ్రబలింతు రిలన్.

50


క.

కులము గుణంబును గలవా
రల నీచుల సమత నడపరా దధిపతి కి
య్యిలఁ దారతమ్య మెఱిఁగిన
నలరుచుఁ బేదైనఁ గొలుతు రతనిన్ భృత్యుల్.

51


క.

గాజును మణిసమముగఁ గను
రాజును బ్రజపట్టు లేనిరాజును గొలువుం
దేజంబు లేనిరాజును
రాజనుచుం గొలువ రండ్రు రసికులు ధాత్రిన్.

52


చ.

అనుపమలీలఁ గల్పతరువందును బోలె మహాత్ము లెల్ల నే
జనపతిఁ జేరి సౌఖ్యమునఁ జాలఁగ మింతు రతండు సంపదన్
ఘనత వహించి సన్నుతులు గైకొనుచున్ బ్రతుకొందు నెట్టిచో
నెనయుచు సజ్జనుండు భుజియించుటెకా సిరికిన్ ఫలం బిలన్.

53