పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/7

ఈ పుట ఆమోదించబడ్డది

కామందక నీతిసారము

పైవిధముగఁ బరిశీలితములైన ప్రాచీనరాజనీతిమూలగ్రంథములకుఁ దరువాతఁ గౌటలీయార్థశాస్త్రమునకు సంగ్రహకారికారూపమైన కామందకనీతిసారము సంస్కృతమున వెలసినది. ఇది క్రీ. శ. 4-వ శతాబ్దమునకుఁ బూర్వముదియు 1-వ శతాబ్దమునకుఁ దర్వాతిదియు నని చరిత్రకారులు గుర్తించిరి. ఏతత్కర్త కామందకుఁడు. అతని చరిత్ర మేమియుఁ దెలియరాదు. ఈ కామందకము 36 ప్రకరణములు గలది. కౌటిలీయార్ధశాస్త్రము ననుసరించియే యిది రచితమైనను నిందుఁ గౌటిలీయమునఁ గలవిషయములు గొన్ని కానరావు. కౌటిలీయమున లేనివిషయములు నిందుఁ గొన్ని గలవు. ఈ విషయమున "రాజపుత్రుని విద్యాభ్యాసపద్ధతిని నిర్ణయించు సందర్భములో నతఁడు (కౌటిల్యుఁడు) 'అధ్యక్షులనుండి వార్తను, వక్తృప్రయోక్తలనుండి దండనీతిని నేర్చుకొనవలె' నని చెప్పియున్నాఁడు. ఇతనికి నితరగ్రంథకర్తలకుఁ గల భేద మిదియే. కామందకాదు లిట్టివ్యవహారానుభవము గలిగినవారు కారు ఇతరులు వ్రాసిన గ్రంథముల వివేకదృష్టితో విమర్శించి స్వాభిప్రాయములఁ గొన్నిటిని జేర్చి కామందకుఁడు లోనగువారు నీతిశాస్త్రముల రచించిరి. కనుకనే వారిపుస్తకములందు సందర్భానుచితములగు ప్రశంసలుకూడ నక్కడక్కడఁ గన్పడుచుండును. కౌటిల్యుఁ డట్లుగాక సందర్బోచితముగను వ్యవహారానుకూలముగను వ్రాసియున్నాఁడు."[1]

ఈ గ్రంథ మనుష్టుప్‌శ్లోకాత్మకమైనదైనను వ్యాఖ్యానిరపేక్షముగా నర్థము కానిది. దీనికి జయమంగళ యనియు, మఱొకటియు వ్యాఖ్యలు గలవు. తిరువాన్కూరు ముద్రణాలయమువారు ప్రకటించిన జయమంగళవ్యాఖ్యానముతోడి ముద్రణమే యున్నవానిలోఁ బ్రశస్తమైనది. ఇప్పటికి 100 ఏండ్లకుముందు తడకమళ్ళ వేంకటకృష్ణారాయలను గొప్ప

  1. కౌటిలీయార్థశాస్త్రము - ఉపోద్ఘాతము — శ్రీ మామిడిపూడి వెంకటరంగయ్య ఎం. ఏ. గారు.