పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/67

ఈ పుట ఆమోదించబడ్డది


చ.

కనుఁగొనఁ బొల్చి నిల్కడల గైకొని సజ్జనసేవ్యుఁడై కడున్
ఘనత వహించి పుణ్యములు గాంచి నుతించగ మించునేలికన్
వినయము నీతిమార్గము వివేకము కల్మిని గల్గఁగోరుచున్
జనములు గొల్వఁగాఁ జనుఁ ద్రిసంధ్య మవంధ్యము వింధ్యముంబలెన్

12


క.

చెందంగరాని వస్తువు
లందును యత్నమ్ము సేయ నవి సిద్ధముగాఁ
జెందుం గావునఁ దాఁ జే
యందగు యత్నము వివేకి యగువాఁ డెందున్.

13


క.

అనిశము వినయము విద్యయు
ఘనమగు శీలాదికంబుఁ గైకొనవలయున్
దనమతి జనపతి యనుగతి
దనరఁగ సేవించువాఁ డుదారప్రౌఢిన్.

14

అనుజీవి వర్తనము

సీ.

కులము విద్యలు శిల్పములు నుదారత్వంబు
           నలరు సత్త్వము నిల్క డంది తగుట
యందమౌ దేహంబు నారోగ్యమును బుద్ధి
           వడిగలతనముఁ దావనత గలిగి
దుర్జనత్వంబును ద్రోహంబు భేదంబు
           నత్యాశయును గల్లలాడుటయును
జపలత మ్రాన్పాటు శరతయుఁ బోఁ ద్రోచు
           నతఁడు సేవ యొనర్ప నర్హుఁ డెందు


గీ.

నోపిక దిటంబు గల్గుట యొప్పిదంబు
సంతసంబును శీల ముత్సాహ మాప
దలకుఁ గ్లేశములకు నోర్వఁగలుగుటయును
వన్నెఁ దెచ్చును నీచసేవకుల కెల్ల.

15