పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/6

ఈ పుట ఆమోదించబడ్డది

ఇతిదాక్షుషీయే౽ర్థశాస్త్రే ప్రథమః పటలః

ఈ చాక్షుషీయమందలి విషయసంగ్రహమును బట్టి కౌటిలీయాదిగ్రంథముల కిది మూల మని తెలియుచున్నది. చాక్షుషీయవిషయమే కౌటిలీయమున విపులముగ వివృతమై యున్నదని రెంటిని బరిశీలించినవారికిఁ దప్పక గోచరింపఁ గలదు.

సంస్కృతవాఙ్మయమున నర్ధశాస్త్రగ్రంథములు పెక్కు లుండెడివి. కాని దురదృష్టవశమున నవి యన్నియు నశించినవి. బ్రహ్మ, బృహస్పతి, శుక్రుఁడు, విశాలాక్షుఁడు, ఇంద్రుఁడు, మొదలగువారు రచించిన గ్రంథరాజములు కానవచ్చుటలేదు. లబ్ధములగు గ్రంథములలోఁ జాక్షుషీయ కౌటిలీయములే ప్రశస్తములు.

కౌటిలీయకర్త కౌటిల్యుఁడను నామాంతరముగల చాణక్యుఁడని పలువు రందురు. ఆ చాణక్యుఁడు మౌర్యసామ్రాజ్యచక్రవర్తియగు చంద్రగుప్తుని మంత్రియై యుండుటచేతను, చంద్రగుప్తచక్రవర్తి క్రీ. పూ. 325 నుండి 298 వఱకు రాజ్యమేలె నని యుండుటచేతను నీ కౌటిలీయము క్రీ. పూ. నాల్గవశతాబ్దపుగ్రంథ మని నుడువవచ్చును.

పదవశతాబ్దమువాఁడగు భోజుఁడును అర్ధశాస్త్రమునఁ గృషిసల్పిన ట్లతని నీతిభూషణ మనుగ్రంథము తెల్పుచున్నది. అం దర్థశాస్త్రవిషయమునంతను 1. వినయ 2. వార్తా 3. వ్యవహార 4. రక్షా 5. మంత్ర 6. ఉపాయ 7. విక్రమ 8. యుద్ధ 9. ఉపనిషత్ 10. ప్రశమస్కంధము లని పది విభాగములుగా రచించె నని తెలియుచున్నది. కాని యాగ్రంథము లభ్య మగుటలేదు.[1]

  1. ఇందాఁక శ్రీరామకృష్ణకవిగారు ఉపవేదములు అనుపేర రుధిరోద్గారి సం॥ ఆంధ్రపత్రికలో ప్రకటించిన వ్యాసమునుండి విషయము గ్రహింపబడెను.