పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/218

ఈ పుట ఆమోదించబడ్డది


క.

కలహము మాన్పెడుకొఱకై
బలియున కీవలయుఁ బ్రియముఁ బల్కుచునై నా
నల దుర్యోధనుఁ డీయక
చలమునఁ గులమెల్లఁ గూల్చి సమయఁడె తానున్.

125


క.

జనపతి దానోపాయము
మునుగా సామంబు భేదమును గావింపం
జను దానముచేతను మిం
చినసామము భేద మర్థసిద్ధిం జేయున్.

126


ఆ.

తృణముపోలె నీవి నెసఁగనిసామంబు
గార్యసిద్ధి చేయఁ గాన దెందు
నీవి చూపఁడేని యిల్లాలు దనకై
రిత్తమంచిమాట బత్తిగనునె.

127


వ.

భేదోపాయప్రకరణము.

128


క.

అనురాగంబును నెయ్యం
బును జెఱుచుట చాలఁగినుకఁ బుట్టించుట జం
కెన చూపి తలఁక చేయుట
యన భేదము మూఁడుదెఱఁగులై చెలువొందున్.

129


వ.

భేదోపాయప్రయోగము.

130


క.

తను వాని కమ్ముకొనుగతిఁ
దననేర్పులు చాల మెఱసి తా హితచర్యం
దనరుచు నరి భేదింపం
జనుఁ జల్లనయైన నీళ్ళు శైలముఁబోలెన్.

131


క.

తమవారు శత్రుచే భే
దము నొందక యుండఁ జేసి తా శత్రుల భే
దముఁ జెందఁ జేయవలయున్
సమకొని తమపక్షమునకు శాంతి ఘటిల్లన్.

132