పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/12

ఈ పుట ఆమోదించబడ్డది


ఉ.

ఒక్కటఁ గూటయుద్ధమున నుక్కఱ శత్రు వధించినన్ జయం
బెక్కుడు గల్గి పాప మొకయించుక పొందదు నిశ్చయంబు పే
రుక్కున ద్రోణసూనుఁ డుఱ కొక్కయెడ న్నడురేయి నిద్రమైఁ
జొక్కిన పాండునందనులఁ జూచి వధింపడె సౌప్తికక్రియన్.

(స. స. ప. 354. ఆం. కా. ఆ. 8. ప. 50.)

ఆంధ్రకామందక నీతిసారము — గ్రంథరచనము

ఇది ప్రాచీనకామందకమంత రసవంతము కాదేమో కాని శబ్దశుద్ధియు విషయవైశద్యమును, ఉత్తమరచనము మున్నగు సుగుణములతో నొప్పుచున్నది. ఇం దాంధ్రదేశపురాజనీతి సంప్రదాయములు కొన్ని గలవు. ఆంధ్రదేశపురాజనీతి పరిభాషాపదములు కొన్ని యచ్చటచ్చటఁ గలవు. రాజనీతిశాస్త్రపరిశోధకులు వానినెల్ల నుద్దరింపవచ్చును. రాజ్యములే పోవుచున్న యీ కాలములో నీ రాజనీతిగ్రంథములు చరిత్రకారుల శాస్త్రనిర్మాణక్రమాది చరిత్రపరిశీలనమునకేగాని రాజ్యాంగప్రయోజనమున కుపకరింపవు. కాని లోకవ్యవహారజ్ఞానము వీనివలన విశేషముగా లభింపఁగలదు.

కృతికర్త — గ్రంథరచనాకాలము

మ.

రమణీయంబుగ శాలివాహశకవర్షంబుల్ గతంబై సహ
స్రము నేనూఱును నాఱునై వెలయఁగాఁ బ్రౌఢిం దెనింగించి రౌ
ర మహిం దిమ్మయవేంకటాద్రివిభుపేరన్ వేడ్కఁ గామందకీ
యము శ్రీ వేంకటరామకృష్ణులు స్వభాన్వబ్దంబునన్ రూఢిఁగా.

అను నాశ్వాసాంతపద్యమును బట్టి యిది రామకృష్ణకవులచే రచితమని తెలియుచున్నది. కొంద ఱీగ్రంథము రామకృష్ణకవులను జంటకవులచే రచితమని యందురు గాని యందు