పుట:అమ్మనుడి మార్చి 2021.pdf/13

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రియాపదాలు అధిక సంఖ్యలో వుంటాయి. ప్రత్యయాలు తక్కువ సంఖ్యలో వుంటాయి. ప్రకృతి ప్రత్యయాలను కలిపి ఒకే పదంగా రాస్తే పదాల సంఖ్య పెరిగిపోతుంది. వాటి సంఖ్య ఎంత వుంటుందంటే - ప్రకృతి పదాల సంఖ్యను ప్రత్యయ పదాల సంఖ్యచే గుణించగా వచ్చిన లబ్దంతో సమానంగా వుంటుంది. అందుచేత ప్రకృతి ప్రత్యయ విభాగం తప్పనిసరి. కంప్యూటర్‌ వాక్యాన్ని పదాలుగాను, పదాలను పదాంశాలుగాను విభజించి వాటి అర్థాలను ప్రత్యేకమైన పదకోశం (నిఘంటువు) నుండి గ్రహిస్తుంది. (నా కంప్యూటర్‌ వ్యాకరణార్దాన్నీ నైఘంటుకార్దాన్నీ వేరు వేరు చోట్ల నుండి గ్రహిస్తుంది. అందుకోసం నేను ఒక ప్రత్వేకమైన నిఘంటువును (పదకోశం) తయారు చేసుకొంటున్నాను. )

విశ్లేషణలో ఎదురయ్యే సమస్యలు : ఒక్కో భాషలో ఒక్కో సమస్య వుంటుంది. నామపదాలు ప్రత్యయాలతో కలిసేటప్పుడు అనేక సంధి మార్పులు జరుగుతాయి. అందుచేత ధాతు రూపాలు, ప్రకృతి రూపాలు, సంధిరూపాలు వేరు వేరుగ నిఘంటువులో రాసుకొని గ్రహించవలసి వుంటుంది. క్రియాపదంలో ధాతువుకు కాలబోథక, పురుషబోధక, వచన బోధక ప్రత్యయాలు అతుక్కొని వుంటాయి. వాటిని వేరుచేయగలిగే సరైన మార్గం వెతుక్కోవాలి.

కంప్యూటర్‌ భాష ఇంగ్లీషు అనుకొందాం. “going” అన్న పదానికి అర్ధం వెదుకుతూ “go” వచ్చేసరికి అర్ధం గ్రహిస్తుంది. తరువాత “ing " ప్రత్యయం యొక్క వ్యాకరణార్థం గ్రహిస్తుంది. మరొక పదం “good" తీసుకొందాం. “go” పూర్తికాగానే అర్ధం గ్రహించడం జరిగిపోతుంది. “od” కి అర్థం దొరకదు. తెలుగులో కూడ ఇటువంటి పదాలుంటాయి. “దేశముదురు” అన్న పదంలో “దేశము” పూర్తికాగానే అర్ధం గ్రహించడం జరిగిపోతుంది. “దురు "కి అర్ధం దొరకదు. “దేశ ముదురు” అని రాస్తే సమస్య లేదు. కాని సమాసాన్ని కలిపి రాస్తారు. పదాలమధ్య ఖాళీ ఉంచడంలో ఒక పద్ధతి లేదు. “నా పుస్తకము, నాయొక్క పుస్తకము, నా యొక్క పుస్తకము” అన్నా అర్ధం మారదు. “ఆమెపుస్తకం...” (her book), పదాల మధ్య ఖాళీ లేదు. వాక్యం పూర్తికాలేదు. “ఆమె పుస్తకం.” (She is a book) పదాల మధ్య ఖాళీ ఉంది. ఇక్కడ వాక్యావసానాన్ని సూచించే గుర్తు(.) వుంది. ఖాళీ వుంటే ఒక అర్థం, ఖాళీ లేకపోతే ఇంకొక అర్థం వస్తుంది. “అతను పుస్తకం” (he is a book). ఇక్కడ (.) గుర్తు వున్నా లేకపోయినా అర్థం మారదు. “అతని పుస్తకం” “అతనిపుస్తకం” (his book) ఖాళీ వుంచినా లేకపోయినా అర్ధం మారదు. “అతను” కి 'అతని ' అనే ఔజపవిభక్తిక రూపం వుంది. “ఆమె” కు లేదు. అందుచేత “అతని” తో చిక్కులు లేవు. “ఆమెతో” నే చిక్కులు. అలాగే “ఆయన” తో గూడ చిక్కులే. ఔపవిభక్తిక రూపాలు లేనిచోట్ల ఇటువంటి చిక్కులు వస్తాయి.

మనభాషలలో సంధిరూపాలు ఎక్కువ. కాబట్టి ముందుగా సంధులను విడదీసి పదాలను గ్రహించాలి. ఇది క్లిష్టసమస్య. “అయ్యవసరము” అన్న సమాసాన్ని 60 శాతం పైగా డిగ్రీ చదువుతున్న విద్యార్థులు “అయ్య + వసరము” అనే విడదీశారు. వారికి “అయ్య” తెలుసు. (గ్రామాలలో ఈ పదం వాడుకలో వుంది.


కంప్యూటర్‌ కి ముందుగా ఈ పదం తెలిసుంటే అది కూడ ఇలాగే విడదీస్తుంది. అలాగే తెలుగునుండి ఇంగ్లీషులోకి అనువదించే సందర్భాలలో గూడ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఉదాహరణకు “కుక్కపిల్ల " అన్న సమాసానికి 'కుక్క ' కీ అర్ధం వుంటుంది. 'పిల్ల ' కీ అర్ధం వుంటుంది. వెరసి ఇంగ్లీషులో “dog child" అనువాదంగా వస్తుంది. ఇంగ్లీషులో “కుక్కపిల్ల” కు “pup” అన్న ఒక పదంవుంది. కాబట్టి పదాలకు వేరుగాను, సమాసాలకు వేరుగాను అర్ధాలు రాసుకోవాలి.

వాక్య విశ్లేషణం : ఇంతవరకు పదవిశ్లేషణ గురించి మాత్రమే తెలుసుకొన్నాం. ఇప్పుడు వాక్యవిశ్లేషణ గురించి ఆలోచిద్దాం. వాక్యాలలో సామాన్యవాక్యాలు, సంక్షిష్ట వాక్యాలు, సంయుక్త వాక్యాలు వుంటాయి. సామాన్యవాక్యాలలో కర్తర్ధక వాక్యాలు, కర్మార్థక వాక్యాలే కాకుండా - భావార్థక వాక్యాలు, మధ్యార్దక (Middle) వాక్యాలు ఉంటాయి. వీటిని గుర్తించి అర్థం చేసుకోగలిగే సామర్థ్యం యంత్రానికి వుండాలి. వాక్యంలోని పదాలను భాషాభాగాలుగా గుర్తించడమేగాదు వాటి పనిగూడ తెలియాలి. అంటే వాక్యంలో ఆపడం ఉద్దేశ్యమో (Subject) విధేయమో(Predicate) తెలియాలి. కర్త్హ కర్మ క్రియలు తెలియాలి. అందుకోనం భాషా సంప్రదాయం తెలియాలి. ఇంగ్లీషులాటి భాషలలో వాక్యంలోని పదాల స్థానాన్ని బట్టి కర్త, కర్మలను నిర్ణయిస్తాం. తెలుగు, సంస్కృతం వంటి కొన్ని భాషలలో 'ప్రత్యయాన్నిబట్టి కర్త, కర్మలను గుర్తించవచ్చు. తెలుగులో “రాముడు రావణుని చంపెను “రావణుని రాముడు చంపెను” అన్నా అర్దం మారదు. కాని ఇంగ్లీషులో "Rama killed Raana" అనడానికి బదులుగా "Raana killed Rama“ అంటే అర్థం మారిపోతుంది. వాక్యం వ్యాకరణ యుక్తంగానే వుంది. ఇంగ్లీషులో వాక్యంలో పదాల స్థానాన్ని బట్టి కర్త, కర్మల నిర్ణయం జరుగుతుంది. ఈ విషయం యంత్రానికి తెలియాలి. అనువాదంలో ఇటువంటి మార్పులు చెయ్యవలసి వుంటుంది.

ఇప్పుడు యంత్రానికి ఇంగ్లీషు భాషలోని పదాలు, అవి ఏ వర్గానికి చెందినవో ఆ వివరాలు, ఆ భాష యొక్క వ్యాకరణం మొదలైనవి తెలుసు. ఇంగ్లీషులోని "You killed he” అన్న ఈ వాక్యాన్ని కంప్యూటర్‌ కు మేపితే దానికి అర్ధం కాదు. మనకు జవాబు రాదు. ఎందుకంటే ఇంగ్లీషు వాక్యంలో తప్పుంది. కర్మ “he” కాదు. “him” వుండాలి. భాషకు సంబంధించిన సమస్త విషయాలు కంప్యూటర్‌ మనస్సులో నిక్షిప్తమై వుంటాయి. ఇది కంప్యూటర్‌ యొక్క జ్ఞానం. కంప్యూటర్‌ యొక్క ఈ జ్ఞానాన్ని మనం అనువాదానికి నియోగించుకోవచ్చు. అనువాదంలో కర్త కర్త గాను, కర్మ కర్మ గాను అనువదించవలసి వుంటుంది. దీనికి నిఘంటువు సహాయపడదు.

“ఈ పుస్తకం చదువు” “అందరికీ చదువు కావాలి” అన్న వాక్యాలలో మొదటి వాక్యంలో 'చదువు ' క్రియ. రెండవ వాక్యంలో 'చదువు ' నామవాచకం. “This is a book" This book is good అన్న వాక్యాలలోనీ మొదటి మాటకు రెండు అర్థాలు ఉన్నాయి. మొదటి వాక్యంలోని "This" పురుషబోధక సర్వనామం, ఉద్దేశ్యం (Subject) రెండవ వాక్యంలోని "This” నిర్దేశ సర్వనామం, ఉద్దేశ్యం

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మార్చి-2021

13