పుట:అమరావతీస్తూపము, ఇతర వ్యాసములు.pdf/8

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శుద్ధోదనుఁ డాబాలుని అరచేతి చందమామవలె నల్లారుముద్దుగఁ బెంచి యుక్తవయస్సున యశోధర యను సౌందర్యరాశి నొసంగి పరిణయముఁ గావించెను. ఈ యువదంపతుల ప్రేమఫలముగ రాహులుఁడను కుమారుఁ డుదయించెను. కాని దుఃఖమయమయిన యీ ప్రపంచమును జూచి కోమలహృదయముగల సిద్ధార్థుఁడు తీవ్రవేదన నొంది శాంతిఁగానక, తుదకు దుఃఖనివర్తనమార్గము నన్వేషింప ఆలు బిడ్డలను, కన్న తండ్రిని, కడకు రాజ్యసర్వస్వమును - సర్వమును పరిత్యజించి కపిలవస్తునగరముననుండి యొరు లెఱుంగకుండ నర్ధరాత్రమున బయలుదేఱి పోయెను. బౌద్ధులు దీనిని మహాభినిష్క్రమణ మందురు. నగర వినిర్గితుఁడయి యాతఁడు మహారణ్యముల కరిగి యేడేండ్లపాటు ధ్యానసమాధినిష్ఠ నుండి యేకాగ్రతతో తపస్సు చేసెను. ఈకాలమున బౌద్ధులకు శనివంటివాఁ డయిన మారుఁడు సిద్ధార్థుని ఏకాగ్రబుద్ధిని చలింపఁజేసి యాతని తపస్సు భగ్నముచేయ ననేకవిధములఁ బ్రయత్నించెను కాని విఫలమనోరథుఁ డయ్యెను. తుదకు సిద్ధార్థుఁడు బుద్ధగయ సమీపమునందలి యురువెలా పరిసరారణ్యమున నొక యశ్వత్థవృక్షము క్రింద తీవ్రధ్యానసమాధి నుండి పరమ సత్యప్రబోధమును గాంచెను. అంతటి నుండి యాతఁడు బుదుఁ డనియు, నావృక్షము బోది వృక్షమని