పుట:అమరావతీస్తూపము, ఇతర వ్యాసములు.pdf/7

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అమరావతీ స్తూపము


స్తూపము


స్తూపమను సంస్కృత పదమును, దిబ్బయని యర్థమిచ్చు 'థూపో' యను పాలీపదమును సమానార్థకములు. కాని బౌద్ధ వాస్తువున (Buddhist architecture) ఇటికతోనో, ఱాతితోనో కట్టిన అర్ధగోళాకారముగ నుండు సమాధివంటి ఘననిర్మాణమునకే స్తూప మను పేరు రూఢియగుట వలన, దిబ్బ యైనదెల్ల స్తూపము కాఁజాలదు. ఈ నిర్మాణము బౌద్ధమతము వాస్తువునకుఁ బ్రసాదించిన విశేషము. స్తూప ప్రాముఖ్యమును దెలిసికొనుటకు, బుద్ధుని జీవితము కొంత తోడ్పడఁగలదు.

శాక్య వంశజుఁడయిన శుద్ధోదనుఁడు కపిలవస్తు నగరము రాజధానిగ శాక్యరాజ్యమును పాలించుచుండెను. అతని పట్టమహిషియైన మాయాదేవి యొకప్పుడు, బోధిసత్వుఁడు తుషిత స్వర్గముననుండి వెల్లయేనుఁగు రూపమున భూలోకమున కవతరించి తన గర్భమునఁ బ్రవేశించినట్లు స్వప్నముఁ గాంచెను. అనతి కాలముననే ఆమె గర్భవతియై, కపిలవస్తు నగరమునకు చేరువ నున్న దేవదహ గ్రామమునందలి తన పుట్టినింటి కరుగుచు, మార్గమధ్యమునఁ గల లుంబినీవనమున